- ఇక్రిశాట్‌లో సైంటిస్టులు, అధికారులతో హైలెవెల్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం సమగ్ర ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఇక్రిశాట్‌లో ఐఎండీ, క్రిడా తదితర సంస్థల సైంటిస్టులు, అధికారులతో మంత్రి హైలెవెల్ రివ్యూ నిర్వహించారు. కరువు పరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలపై సైంటిస్టులు ఇచ్చిన రిపోర్ట్ సలహాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 20 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందన్న మంత్రి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. వాతావరణ శాఖ డేటా ఆధారంగా ప్రతి వారం మండలాల వారీగా అగ్రికల్చర్ సమాచారాన్ని రైతు వేదికలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను బట్టి మూడు దశల్లో విత్తనాలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈనెల 15 వరకు వర్షాలు ఆలస్యమైతే తక్కువ నీటితో పండే పంటల కోసం 16.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలను, ఈనెల 30 వరకు పడకపోతే ఆయా పరిస్థితులకు తగ్గట్లు 13.82 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందిస్తామన్నారు.
ఒకవేళ ఆగస్టు 15 వరకు వర్షాభావం కొనసాగితే కరువును తట్టుకునేలా 12.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. నీటి లభ్యతను బట్టి వరికి బదులుగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు. వరి రైతులు నారు చివరలు కత్తిరించడం, కార్బోఫ్యూరాన్ వాడకం, నీటి పొదుపు పద్ధతులు పాటించాలని, ఇంకా నారు పోయని వారు నేరుగా వడ్లు వేసే విధానాన్ని అనుసరించాలని సూచించారు. మొలక దశలో ఉన్న పత్తి, మొక్కజొన్న పంటల సంరక్షణపై రైతులకు గైడెన్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
