- అందులో భాగంగానే ఈవీ పాలసీ తెచ్చినం
- ఈవీలకు రోడ్, రిజిస్ట్రేషన్ పన్నులో 100 శాతం మినహాయింపు ఇస్తున్నం
- గ్లోబల్ సమిట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పర్యావరణం, ప్రజారోగ్యం, ఇంధన పొదుపు, ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందులో భాగంగానే ఈవీ, స్క్రాప్ పాలసీలను తెచ్చామన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు రోడ్, రిజిస్ట్రేషన్ పన్నుల్లో 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు.
సోమవారం ప్రారంభమైన ‘గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమిట్ 2047’ ప్రోగ్రాంలో ‘ఎలక్ట్రిక్ వాహనాలు.. నాన్ ఎమిషన్ టెక్నాలజీ’ అనే అంశంపై పొన్నం మాట్లాడారు. గ్రీన్ మొబిలిటీ 2047 కోసం ప్రభుత్వ విజన్ గురించి మంత్రి వివరించారు.
రాష్ట్రంలో సురక్షితమైన స్మార్ట్, డిజిటల్, పారదర్శకమైన స్థిరత్వ లక్ష్యాలతో పర్యావరణహితంతో కూడిన రవాణా వ్యవస్థను నిర్మిస్తున్నామని చెప్పారు. దీనికోసం ఆధునీకరించిన మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికత, బలమైన పాలన సంస్కరణలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేసేందుకు అత్యంత ఉదారమైన ఈవీ పాలసీని ప్రవేశపెట్టాం. ఈవీలకు రోడ్డు, రిజిస్ట్రేషన్ పన్నును 100 శాతం మినహాయింపు ఇచ్చాం. దీంతో ఈవీల వినియోగం 2023 డిసెంబరులో 0.60 శాతం ఉండగా, 2025 నవంబర్ కు అది 1.39 శాతానికి పెరిగింది.
అలాగే, స్క్రాప్ పాలసీలో గ్రీన్ టాక్స్ మినహాయింపు ఇచ్చాం. పెండింగ్ జరిమానాలు కూడా పూర్తిగా మాఫీ చేశాం. పాత వాహనాలను స్క్రాప్ చేసిన తర్వాత ఆ యాజమానులు కొత్త వాహనాలను కొనే సమయంలో పన్ను రాయితీ ఇస్తున్నాం. స్క్రాప్ కు వచ్చే వాహనాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. సారథి, వాహన్ పోర్టల్ ద్వారా లైసెన్స్ లు, ఇతర పత్రాలు డిజిటలైజేషన్ చేస్తున్నాం’’ అని మంత్రి పేర్కొన్నారు. హైవేలు, ప్రధాన రహదారులపై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చెక్ పోస్టులను ఎత్తేశామని వెల్లడించారు. ఈవీ చార్జింగ్ స్టేషన్ల విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. గ్రీన్ మొబిలిటీ అనేది నినాదం కాదని, ఇది ఒక సమిష్టి బాధ్యత, ఆర్థిక అవకాశం కూడా అని మంత్రి పొన్నం అన్నారు.
ఐదు అంశాలపై చర్చ..
సమిట్ లో ‘ఎలక్ట్రిక్ వాహనాలు.. నాన్ ఎమిషన్ టెక్నాలజీ’ అంశంలో ఐదు ప్రధాన అంశాలపై చర్చ జరిగింది. వాణిజ్య వాహనాలను 100 శాతం విద్యుత్తుతో నడిచేలా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం, జడ్‌ఈవీ (జీరో ఎమిషన్ వెహికల్) మోడళ్లను మెరుగుపరచడం, వాటి ధరలు తగ్గించడంపై చర్చించారు.
అలాగే, గడువు దాటిన వాహనాలను స్ర్కాప్ కింద తుక్కుగా మార్చే పాలసీని కచ్చితంగా అమలు చేయడం, ఈవీ చార్జింగ్ స్టేషన్లు పెంచడం, ఈవీ బ్యాటరీలను రీసైకిల్ చేయడానికి సర్క్యు లర్ ఎకానమీ సిస్టమ్ రూపొందించడం పై ఆయా రంగాల ప్రముఖులు కూలంకషంగా చర్చించారు. వీరిలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఎండీ మహేశ్ బాబు, ఉబెర్ ఇండియా హెడ్ ఆప రేషన్స్ అమిత్ దేశ్ పాండే, ఐకియా ఇండియా సీఈవో పత్రిక్ ఆంటొనీ, లోహం డైరెక్టర్ తరుణ్ సింఘాల్ తదితరులు ఉన్నారు.
