సైబర్ కేసుల్లో దేశంలోనే తెలంగాణ సెకండ్ ప్లేస్

సైబర్ కేసుల్లో దేశంలోనే తెలంగాణ సెకండ్ ప్లేస్
  • దేశంలో పెరిగిన నేరాలు
  • 2022తో పోలిస్తే 2023లో 7.2 శాతం అధికం

హైదరాబాద్‌‌, వెలుగు: దేశవ్యాప్తంగా 2023లో నేరాలు 7.2 శాతం పెరిగాయి. 2022లో మొత్తం 58,24,946 కేసులు నమోదు కాగా.. 2023లో 62,41,569 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగింది. 2022లో 65,893 కేసులు నమోదయ్యాయి. 2023లో మొత్తం 31.2 శాతం పెరిగి 86,420 కేసులు రికార్డ్ అయ్యాయి. 21,889 సైబర్ కేసులతో కర్నాటక దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 18,236 కేసులతో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. 2022, తెలంగాణలో 15,297 సైబర్‌‌ నేరాలు నమోదు కాగా.. 2023లో 18,236కి చేరినట్టు నేషనల్‌‌ క్రైం రికార్డ్స్‌‌ బ్యూరో (ఎన్‌‌సీఆర్‌‌బీ) 2023 నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మర్డర్ కేసులు స్వల్పంగా పెరిగాయి. 2022లో 937 హత్య కేసులు నమోదుకాగా.. 2023లో 954 కేసులు రిజిస్టర్ అయినట్లు లెక్కలు చెప్తున్నాయి.

ఆర్థిక నేరాలు ఎక్కువే

ఆర్థిక నేరాల్లోనూ జాతీయ స్థాయిలో తెలంగాణ రెండో ప్లేస్​లో నిలిచింది. 2022లో 26,321 కేసులు, 2023లో 26,881 కేసులు నమోదైనట్టు ఎన్‌‌సీఆర్‌‌బీ నివేదిక వెల్లడించింది. 2023లో దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో 68.9 శాతం మోసం, 4.90 శాతం లైంగిక దోపిడీ, 3.8 శాతం దోపిడీ కేసులున్నాయి. ఆర్థిక నేరాల్లోనూ 6 శాతం పెరుగుదల నమోదైంది. 2023లో మొత్తం 2,04,973 కేసులు నమోదుకాగా, వీటిలో నమ్మక ద్రోహం, ఫోర్జరీ, మోసం కేసులు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక చెప్తున్నది. వీటితో పాటు 27,721 హత్య కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 9,209 కేసుల్లో వివాదాలకు సంబంధించి ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటు వ్యక్తిగత శత్రుత్వం, ద్వేషంతో 3,458, వ్యక్తిగత లబ్ధి, లాభం కోసం జరిగిన హత్యలపై1,890 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించింది.

మహిళలపై నేరాల్లో స్వల్పంగా పెరుగుదల

దేశంలోని చిన్నారులపై లైంగిక దాడులు సహా ఇతర నేరాలకు సంబంధించి పోక్సో కేసుల సంఖ్య పెరిగింది. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 3,165 పోక్సో కేసులు నమోద య్యాయి. ఈ క్రమంలో  దేశంలో 2022తో పోలిస్తే 2023లో 9.2 శాతం పెరిగింది. 2023లో పిల్లలపై మొత్తం 1,77,335 నేరాలు నమోదుకాగా.. 2022లో 1,62,449 కేసులు నమోదయ్యాయి. వీటిలో పిల్లల కిడ్నాప్‌‌కు సంబంధించినవి 79,884 కేసులు, పోక్సో చట్టం కింద 67,694 కేసులు ఫైల్ అయ్యాయి. మహిళలపై నేరాల్లో  స్వల్ప పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా 2022లో 4,45,256 కేసులు నమోదు కాగా..2023లో 4,48,211 (0.7 శాతం) కేసులు మహిళలపై నేరాలకు సంబంధించి నమోదయ్యాయి. ఇందులో భర్త లేదా అత్తింటివారి దాడులకు సంబంధించి 1,33,676 కేసులు, కిడ్నాప్‌‌నకు సంబంధించి 88,605 కేసులు, లైంగిక వేధింపులకు సంబంధించినవి 83,891 కేసులు, పోక్సో యాక్ట్‌‌ కింద 66,232 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే 2022లో 1,07,588 కిడ్నాప్‌‌ కేసులు నమోదు కాగా, 2023లో 1,13,564 నమోదయ్యాయి. వీటి సంఖ్య2022తో పోలిస్తే 2023లో 5.6% పెరుగుదల నమోదైనట్టు ఎన్‌‌సీఆర్‌‌బీ నివేదిక వెల్లడించింది. కిడ్నాపైన వారిలో 1,40,813 మంది జాడను పోలీసులు గుర్తించారు. వీరిలో 1,39,164 మంది బతికి ఉన్నారని మరో 1,649 మంది చనిపోయినట్లు గుర్తించినట్లు రిపోర్ట్‌‌లో పేర్కొంది.