
- ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్సీ (డీఏపీఎస్సీ/ ఎస్సీ సబ్ ప్లాన్(ఎస్సీఎస్పీ) కింద 2023– 24 ఫైనాన్షియల్ ఇయర్ లో తెలంగాణ లో రూ. 4,655.89 కోట్లు ఖర్చు చేసి నట్టు కేంద్రం వెల్లడించింది. ఇదే సందర్భంలో దేశ వ్యాప్తంగా 36 రాష్ట్రాలు/యూటీలకు రూ. 1, 25, 471.92 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం లోక్ సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
2014లో నీతి ఆయోగ్ "రాష్ట్రాల కోసం షెడ్యూల్డ్ కుల ఉప ప్రణాళిక (ఎస్సీఎస్పీ), గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ) కోసం మార్గదర్శకాలు–2014" అనే శీర్షికతో గైడ్ లైన్స్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని ఎస్సీ/ఎస్టీ జనాభా ప్రకారం నిధుల కేటాయింపు జరుగుతుందని వివరించారు. కాగా, దేశ వ్యాప్తంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో డీఏపీఎస్సీ/ఎస్సీఎస్పీ కింద రూ. 1,65, 492.72 కోట్లు, 2025–26 కింద రూ. 1, 68, 478.38 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, నైపుణ్యాభివృద్ధి శాఖ మరో 853.68 కోట్లను డీఏపీఎస్సీ/ఎస్సీఎస్పీ కింద అలకేట్ చేసినట్లు స్పష్టం చేశారు.