ఎయిడ్స్‌‌ నియంత్రణలో తెలంగాణ టాప్‌‌ -5

ఎయిడ్స్‌‌ నియంత్రణలో తెలంగాణ టాప్‌‌ -5
  •     మూడేండ్లలో 31వ స్థానం నుంచి ఐదో ర్యాంకుకు
  •     హెచ్‌‌ఐవీ నిర్ధారణ అయిన వారందరికీ ఉచిత ఏఆర్‌‌టీ చికిత్స

హైదరాబాద్‌‌, వెలుగు: ఎయిడ్స్‌‌ నివారణ, నియంత్రణ చర్యల్లో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించింది. నేషనల్‌‌ ఎయిడ్స్‌‌ కంట్రోల్‌‌ ఆర్గనైజేషన్‌‌ (నాకో) రూపొందించే ‘ప్రోగ్రామ్‌‌ ఇంప్లిమెంటేషన్‌‌ స్కోర్‌‌కార్డ్‌‌’లో 2022–23లో 31వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. 2025–26 నాటికి ఐదో ర్యాంకుకు చేరింది. ఎయిడ్స్‌‌ నియంత్రణ కార్యక్రమాలు, సేవా కేంద్రాలు, వ్యాధి నిర్ధారణ, ఉచిత మందుల సరఫరా, వైరల్‌‌ సప్రెషన్‌‌ తదితర అంశాల్లో పనితీరు ఆధారంగా నాకో ర్యాంకులు కేటాయించింది. అంతర్జాతీయంగా  డబ్ల్యూహెచ్​ఓ సూచించిన లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్రంలోని అంచనా హెచ్‌‌ఐవీ కేసుల్లో 87.2 శాతం మందిని గుర్తించారు. 

నిర్ధారణ అయిన వారిలో 100 శాతం మందికి ఉచిత ఏఆర్‌‌టీ చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 96.1 శాతం మంది వైరల్‌‌ సప్రెషన్‌‌ సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 127 ఉచిత పరీక్ష కేంద్రాలు, 11 మొబైల్‌‌ ఐసీటీసీలు, 30 సంపూర్ణ సురక్ష కేంద్రాలు, 48 ఎస్‌‌టీఐ క్లినిక్‌‌ల ద్వారా సేవలు అందిస్తున్నారు. మాస్‌‌ ప్రచారంలో 10 జిల్లాలు ‘సక్షమ్‌‌’ కేటగిరీలో నిలవడంతో తెలంగాణ దేశంలో రెండో స్థానం సాధించింది. కాగా, 2030 నాటికి ఎయిడ్స్‌‌ను ప్రజారోగ్య సమస్యగా లేకుండా చేయాలనే లక్ష్యంతో బుధవారం హైదరాబాద్‌‌లో ‘ఇంటెన్సీఫైడ్‌‌ ఐఈసీ క్యాంపెయిన్‌‌–2026’ నిర్వహించనున్నారు. ఎన్టీఆర్‌‌ మార్గ్‌‌లోని హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్స్‌‌ నుంచి నేడు ఉదయం 7 గంటలకు 3 కిలోమీటర్ల వాకథాన్‌‌తో పాటు బైక్‌‌, ఆటో ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. మంత్రులు దామోదర్‌‌ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌‌ హాజరుకానున్నారు.