V6 News

సీబీఎస్ఈ తరహాలో సైంటిఫిక్ గా టెన్త్ షెడ్యూల్

సీబీఎస్ఈ తరహాలో సైంటిఫిక్ గా టెన్త్ షెడ్యూల్
  • మ్యాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్టులకు ఎక్కువ సెలవులిచ్చాం 
  • టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వివాదంపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వివరణ 

హైదరాబాద్, వెలుగు: టెన్త్ ఎగ్జామ్స్ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తుల మేరకే ఈసారి పరీక్షల మధ్య తగినంత గ్యాంప్ ఉండేలా చర్యలు తీసుకున్నామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. సీబీఎస్ఈ , ఇతర బోర్డుల విధానాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాకే.. ఈ ఏడాది పరీక్షల షెడ్యూల్ ను సైంటిఫిక్‌‌‌‌గా రూపొందించామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వివాదంపై స్పందిస్తూ ఓ  ప్రకటన రిలీజ్ చేశారు. పరీక్షలు వరుసగా పెడితే విద్యార్థులు రివిజన్ చేసుకోలేక సతమతమవుతున్నట్లు గుర్తించామని నవీన్ నికోలస్ చెప్పారు.  మ్యాథ్స్, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టుల పరీక్షలకు ముందు ఎక్కువ రోజులు సెలవులు ఇస్తున్నామని, ఈ గ్యాప్ తో విద్యార్థులు ప్రశాంతంగా రివిజన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

దీంతో  విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గి, మంచి మార్కులు సాధించడానికి వీలుంటుందని, ఇది టీచర్లకు, ఇన్విజిలేషన్ సిబ్బందికి కూడా వెసులుబాటుగా ఉంటుందని ఆయన వివరించారు.  ఒకేషనల్ పరీక్షలను  ఏప్రిల్ 15న నిర్వహిస్తామని, దీనికి సుమారు 40 వేల మంది విద్యార్థులు హాజరవుతారని, జిల్లాకు సగటున ఒక సెంటర్ ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ 16న ఓరియంటల్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్ష ఉంటుందని, ఇది కేవలం హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే ఉంటుందని, దీనికి 100 మందిలోపే విద్యార్థులు ఉంటారని డైరెక్టర్ స్పష్టం చేశారు. 

ఏప్రిల్ 18 కల్లా సమ్మేటివ్ ఎగ్జామ్స్ క్లోజ్

1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్‌‌‌‌మెంట్ (ఎస్ఏ2) పరీక్షలను అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 18 లోపు పూర్తి చేస్తామని నవీన్ నికోలస్ ప్రకటించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని, సబ్జెక్టుల వారీగా టైం టేబుల్‌‌‌‌ను ఎస్సీఈఆర్టీ త్వరలోనే విడుదల చేస్తుందని ఆయన పేర్కొన్నారు.