- ఇంటర్నెట్ సౌకర్యంలో 23వ స్థానం
- స్పెషల్ నీడ్స్ పిల్లల టాయిలెట్ల నిర్మాణంలో లాస్ట్ నుంచి రెండో స్థానం
- యూడైస్ ప్లస్2024–25 నివేదికలో బహిర్గతం
హైదరాబాద్, వెలుగు: ఐటీ హబ్‌గా చెప్పుకునే తెలంగాణలోని స్కూళ్లు ఇంటర్నెట్ కష్టాలను ఎదుర్కొంటున్నాయి. 37 శాతం బడులు ఇంటర్నెట్కు దూరంగా ఉన్నాయి. ఇక ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం టాయిలెట్లు కట్టడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది. ఈ అంశంలో రాష్ట్రం దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. కేంద్ర విద్యాశాఖ యూడైస్ ప్లస్ 2024–25 డేటా ద్వారా ఈ విషయం బహిర్గతమైంది.
మనకంటే మెరుగ్గా బిహార్‌లో..
రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లు సుమారు 41వేల వరకు ఉన్నాయి. కాగా వీటిలో కేవలం 63.3 శాతం స్కూళ్లలోనే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల కంటే వెనుకబడి తెలంగాణ 23వ స్థానంలో నిలిచింది. లక్ష్యద్వీప్, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్తోపాటు పలు రాష్ట్రాల్లో వందశాతం బడుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఏపీలో 99శాతం బడుల్లో ఉండగా, బిహార్‌లాంటి రాష్ట్రంలోనూ 84.8 శాతం నెట్‌సౌకర్యం ఉండి మనకంటే మెరుగైన స్థానంలో ఉంది. ఇక రాష్ట్రంలో 86 శాతం బడుల్లోనే కంప్యూటర్లు ఉన్నాయి. ఈ అంశంలో 14 స్థానంలో నిలిచాం.
తాగునీరు అందించడంలో తెలంగాణ భేష్
ప్రత్యేక అవసరాలుఉన్న పిల్లలకు (సీడబ్ల్యూఎస్ఎన్) అనుకూలంగా ఉండే టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఐదు శాతంలోపు బడుల్లోనే స్పెషల్నీడ్స్ పిల్లలకు టాయిలెట్స్ సౌకర్యం ఉంది. స్కూళ్లలో బాయ్స్ టాయిలెట్లు 90 శాతం బడుల్లో, గర్ల్స్ టాయ్‌లెట్స్ 95.7 శాతం బడుల్లో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 97 శాతం బడుల్లోనే ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉందని యూడైస్ లెక్కలు చెబుతున్నాయి.
పంజాబ్, హర్యానా, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాలు ఎప్పుడో 100 శాతం విద్యుత్సౌకర్యాన్ని అందిస్తున్నాయి. తాగునీరు అందించడంలో రాష్ట్రం మెరుగైన స్థానంలోనే ఉంది. మొత్తం 99.6 శాతం స్కూళ్లలో నీటి సౌకర్యం ఉంది. లైబ్రరీ సౌకర్యం 94.9 శాతం బడుల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
