- గ్లోబల్ సమిట్ వేదికగా 14 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు
- లక్ష మందికిపైగా ఉద్యోగావకాశాలు.. విద్యుత్ శాఖపై గంటపాటు సెషన్
- పీఎస్పీ ప్రాజెక్టుల్లో రూ.45,650 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన మరిన్ని సంస్థలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 1.09 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 14 సంస్థలు ముందుకొచ్చాయి. సోమవారం ఫ్యూచర్ సిటీలోని -గ్లోబల్సమిట్వేదికగా ఆయా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంది. తద్వారా కొత్తగా లక్ష మందికిపైగా ఉద్యోగాలు వస్తాయని విద్యుత్ శాఖ ప్రకటించింది.
అంతకుముందు సమిట్‌లో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ‘పవరింగ్ తెలంగాణ –2047: ఎనర్జీ ట్రాన్సిషన్ క్లైమేట్ ఫైనాన్స్ అండ్ జస్ట్ ట్రాన్సిషన్ ఫర్ నెట్ జీరో’ అనే అంశంపై గంటకు పైగా సెషన్ జరిగింది.
ఇవీ ఎంవోయూలు
2,750 మెగావాట్ల రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం రూ.31,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ‘ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ ముందుకొచ్చింది. ఈ–మిథనాల్ ప్లాంట్ కోసం ‘ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రూ. 8వేల కోట్లు.. 2జీ ఇథనాల్ ప్లాంట్ కోసం ‘ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రూ.10 వేల కోట్లు.. 1,500 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం ‘ఈ కొరియన్’ సంస్థ రూ.16 వేల కోట్లు.. 2 వేల మెగావాట్ల ఇంటిగ్రేటేడ్ రెన్యువబుల్ ఎనర్జీ పోర్ట్ పోలియో కోసం ‘ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్’ సంస్థ రూ.12,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి.
పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం ‘మై హోమ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రూ.7 వేల కోట్లు, సోలార్ పార్క్ కోసం ‘ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రూ.5,600 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు చేసుకున్నాయి.
అదేవిధంగా వివిధ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎస్ఎల్ఆర్ సురభి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.3 వేల కోట్లు, అథిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ రూ.4 వేల కోట్లు, శ్రీ సురాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ గ్రూప్ కంపెనీస్ రూ.3,500 కోట్లు, సొలానిక్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,400 కోట్లు, హై జెన్కో గ్రీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,250 కోట్లు, సీల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1,600 కోట్లు, యునైటెడ్ టెలికామ్స్ లిమిటెడ్ రూ.2,500 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయని విద్యుత్ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు.
పీఎస్పీ ప్రాజెక్ట్‌ల్లో రూ.45,650 కోట్ల పెట్టుబడులు!
రాష్ట్రంలో 7,460 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాం ట్స్(పీఎస్పీ) ఏర్పాటుకు రూ.45,650 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకొ చ్చాయి. గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఈపీఎల్) రూ.24 వేల కోట్లతో ములుగు జిల్లా ఇప్పగూడెం గ్రామం దగ్గర 3,960 మెగావాట్లు, గ్రీన్ కో టీజీ01 ఐఆర్‌ఈపీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.5,800 కోట్లతో ఆదిలాబాద్ జిల్లా జారీ గ్రామంలో 950 మెగావాట్లు, శ్రీ సిద్దార్థ్ ఇన్ఫ్రా టెక్ అండ్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ రూ.5,600 కోట్లతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా పరిధిలోని రనపూర్ గ్రామంలో 900 మెగావాట్లు, ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.4,650 కోట్లతో నిజామాబాద్ జిల్లా మైలారం గ్రామంలో 750 మెగావాట్లు, సెరల్యూన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.5,600 కోట్లతో ఆదిలాబాద్ జిల్లా రామపురలో 900 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని విద్యుత్ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. ఇవన్నీ ప్రైవేట్ సంస్థలని పేర్కొన్నారు.
ఇది పీపుల్స్ డాక్యుమెంట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2025లో భాగంగా రూపొందించిన విజన్డాక్యుమెంట్రాష్ట్ర ప్రజల డాక్యుమెంట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గ్లోబల్ సమిట్‌లో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
భవిష్యత్ అంతా గ్రీన్ఎనర్జీదే: భట్టి
భవిష్యత్ అంతా గ్రీన్ఎనర్జీ పైనే ఆధారపడి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐదేండ్లలో హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాలుష్యం లేని పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తూనే.. 2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.
సోమవారం గ్లోబల్ సమిట్‌లో విద్యుత్ శాఖపై జరిగిన తొలి సెషన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. వందశాతం పర్యావరణ హిత వాహనాల వైపు మారుతున్నట్లు చెప్పారు. అనంతరం.. సెషన్లో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు సోలార్, విండ్, థర్మల్ పవర్, బ్యాటరీ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
జిల్లాల వారీగా జరిగిన పరిశోధనల ప్రకారం టూరిజం, ఆహార శుద్ధి, టెక్స్టైల్, సోలార్ ఉత్పత్తుల తయారీ లాంటివి పెద్దఎత్తున చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఈ సెషన్లో ఎన్టీపీఎస్ గ్రీన్ సీఈవో సరిత్ మహేశ్వరి, ఇదామ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ కో ఫౌండర్ అజిత్ పండిట్, మహాలక్ష్మీ గ్రూప్ ఫౌండర్ అండ్ సీఈవో హరిష్ యెర్లగడ్డ, సెంటర్ ఎనర్జీ స్టడీస్ ఫ్రొఫెసర్ రాజ్ కిరణ్, కోల్ ఇండియా మాజీ ఛైర్మన్ పీఎం.ప్రసాద్, సోలార్ బుల్ ఎనర్జీ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
