- శనివారం ఒక్కరోజే 22 మంది మృతి
- పలు ప్రాంతాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
- రాష్ట్రవ్యాప్తంగా 69 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలకు తోడు ఎల్‌నినో ప్రభావంతో వీస్తున్న తీవ్ర వడగాడ్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతి చెందారు.
దుమ్ముగూడెంలో 46.3 డిగ్రీలు
శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, జగిత్యాల జిల్లా ధర్మపురి, కుమ్రంభీంలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట 46.2, ఖమ్మం 46.1, మంచిర్యాల 46.1, ములుగు జిల్లాల్లోనూ 46 డిగ్రీల మార్కును దాటేశాయి. మరోవైపు వడగాడ్పులు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 69 మండలాల్లో హీట్‌వేవ్ తీవ్రత ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు 5 నుంచి 8 డిగ్రీల వరకు పెరిగాయి.
ఉదయం 8 గంటల నుంచే సెగలు మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అటు హైదరాబాద్ లోనూ ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చార్మినార్, అంబర్‌పేట్ ప్రాంతాల్లో గరిష్టంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సిటీలోని మెజారిటీ సర్కిళ్లలో ఎండలు 40 డిగ్రీలు దాటాయి. గత ఏడాదితో పోలిస్తే సిటీలో సగటు ఉష్ణోగ్రతలు పెరగడంతో సిటీజన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వడదెబ్బ మృతులు వీళ్లే..
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట గ్రామానికి చెందిన దుగ్యాని కొమురయ్య (101) వడదెబ్బతో చనిపోయాడు. అలాగే ములుగు జిల్లా మంగపేట మండలం పూరేడుపల్లికి చెందిన రైతు ఊటుకూరి సోమిరెడ్డి, కాళేశ్వరంలో గుర్తుతెలియని వ్యక్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కరకవాగుకు చెందిన తాపీమేస్త్రీ పులి వెంకటేశ్వర రావు (38), జూలూరుపాడు మండలం కరివారిగూడెంనకు చెందిన ధరావత్ నర్సింహారావు (45) శనివారం వడదెబ్బతో చనిపోయారు.
వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన పెద్దమ్మ కుమారస్వామి (60), ఖిలా వరంగల్ మండలంలోని రంగశాయిపేట కాపువాడకు చెందిన శెంకేశి భాగ్య లక్ష్మి (65), రంగశాయిపేటకు చెందిన చిలువేరు సారమ్మ (85), పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దొడ్డ సత్యనారాయణ (60), మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంగారిగూడెం గ్రామానికి చెందిన జాన్వు (38), బలపాల గ్రామానికి చెందిన రొయ్యల పెద్ద రాములు (75), సీరోలు మండలం బిల్యా నాయక్‌తండాకు చెందిన బానోతు కమ్లి (65) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో వడదెబ్బతో ఒకే రోజు నలుగురు చనిపోయారు.
గోదావరిఖని కాకతీయనగర్‌కు చెందిన వి.మహేశ్ (50), గోదావరిఖని పరుశురాంనగర్‌కు చెందిన మేరుగు శంకర్ (40) అనే కూలీ, గోదావరిఖని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికురాలు గజనవేణి మల్లమ్మ (60) చనిపోయారు. అలాగే ఏపీలోని కాకినాడ ప్రాంతానికి చెందిన సిరిపురం మండలం ఏలేశ్వరం గ్రామానికి చెందిన మోయ పాండు (48) లారీ నడుపుతూ రామగుండం మీదుగా మంచిర్యాల వెళ్తూ... మల్యాలపల్లి సమీపంలో చనిపోయాడు.
అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన జెట్టి పూలమ్మ (65), పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సుభాశ్‌నగర్‌కు చెందిన న్యాతరి మొండయ్య (76) చనిపోయాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన చిలుముల బక్కయ్య (70), ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన బిలాల్ ఫారిక్ (40) మహారాష్ట్రలోని కిన్వట్‌లో వడదెబ్బతో మృతి చెందాడు.
వడదెబ్బతో మరో ఇద్దరు
కరీంనగర్ జిల్లాలో వడదెబ్బతో శనివారం ఇద్దరు మృతిచెందారు. జమ్మికుంట పట్టణానికి చెందిన గుల్లి లింగయ్య అనే వ్యక్తి కూరగాయల మార్కెట్ బయటికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సాయంత్రం వరకు తీవ్ర జ్వరంతో వాంతులు కాగా ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. అలాగే వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాచమళ్ళ మొగిలి(60) వడదెబ్బతో శనివారం చనిపోయాడు.
