దోమకొండ కోట, మెట్లబావులకు యునెస్కో అవార్డులు 

దోమకొండ కోట, మెట్లబావులకు యునెస్కో అవార్డులు 

కామారెడ్డి, వెలుగు: రాష్ట్రానికి రెండు యునెస్కో అవార్డులు దక్కాయి. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట, హైదరాబాద్ కుతుబ్ షాహీ టూంబ్స్ కాంప్లెక్స్ లోని మెట్లబావులు ‘‘ఆసియా పసిఫిక్ అవార్డు ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్” అవార్డులకు ఎంపికయ్యాయి. 2022 సంవత్సరానికి గాను అవార్డ్ ఆఫ్ మెరిట్ కింద దోమకొండ కోట, అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ కింద మెట్లబావులు సెలెక్ట్ అయ్యాయి. ఈ అవార్డులను శనివారం బ్యాంకాక్ లో యునెస్కో ప్రకటించింది. దోమకొండ కోట వారసులు కామినేని అనిల్, శోభన పురావస్తు శాఖ నుంచి అనుమతి తీసుకొని 2011లో కోట పునరుద్ధరణ పనులు చేపట్టారు. కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అనురాధ నాయక్​ను చీఫ్ కన్సల్టెంట్​గా నియమించారు. ఆమె ఆధ్వర్యంలో కోటలోని కొన్ని బిల్డింగులు, శివాలయాన్ని పునరుద్ధరించారు.

ఈ అవార్డు కోసం ఈ ఏడాది 287 ఎంట్రీలు రాగా..  6  దేశాల నుంచి 13 ప్రాజెక్టులను యునెస్కో ఎంపిక చేసిందని, అందులో దోమకొండ కోట ఒకటని అనిల్, శోభన తెలిపారు. కోట పరిరక్షణ నిరంతరం సాగే పక్రియ అని, ఇది పర్యావరణ హితంగా కొనసాగుతుందని చెప్పారు. కాగా, తెలంగాణలోని సంస్థానాల్లో దోమకొండ సంస్థానం ఒకటి. ఈ సంస్థానాధీశులు కామినేని వంశీయులు. దోమకొండ కోటను 18వ శతాబ్దంలో నిర్మించారు. ఇందులో రాజభవనం, అద్దాల మేడ తదితర బిల్డింగులు, శివాలయం, అశ్వశాలలు, బురుజులు ఉన్నాయి. వీటిని డంగు సున్నం, రాతితో కట్టారు. కోట మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.  కోట చుట్టూ కందకం తవ్వి, రాతి కట్టడంతో ప్రహరీ నిర్మించారు. ఇక కుతుబ్ షాహీ టూంబ్స్ కాంప్లెక్స్ లో 17వ శతాబ్దానికి చెందిన ఆరు మెట్ల బావులు ఉన్నాయి. వీటి పునరుద్ధరణ పనులను 2013లో ఆగాఖాన్ ట్రస్టుతో కలిసి సర్కార్ చేపట్టి పూర్తి చేసింది.