సినీ కార్మికులకు అండగా ఉంటం:మంత్రి వివేక్ వెంకటస్వామి

సినీ కార్మికులకు అండగా ఉంటం:మంత్రి వివేక్ వెంకటస్వామి

 

  • వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తం: మంత్రి వివేక్​
  • త్వరలోనే ప్రత్యేక సమావేశం
  • అర్హులకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు  
  • ఆఫీసు బిల్డింగ్​ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్త.. ఆర్టిస్టులకు పెన్షన్​ విషయంలో కేంద్రానికి లేఖ రాస్త
  • యూనియన్లు ఒకే గొడుగు కిందికి వచ్చి కలిసి ముందుకుసాగాలని సూచన
  • తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్  పుష్కర మహోత్సవానికి హాజరు

బషీర్​బాగ్, వెలుగు:  సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ‘‘సినీ కార్మికులకు శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువగా ఉంటుంది. వారికి సరైన పని గంటలు కూడా ఉండవు. పని ఉన్న రోజే వేతనం దక్కుతుంది. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్త” అని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ 12వ వార్షికోత్సవ పుష్కర మహోత్సవం సోమవారం హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో  జరిగింది. 

కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సినీ కార్మికుల సమస్యలపై త్వరలోనే కార్మిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. మూవీ, టీవీ రంగాల కార్మికులకు ఇండ్ల స్థలాల విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆర్టిస్టులకు పెన్షన్​ విషయంలో ఢిల్లీ స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్ట్రీకి లేఖ రాస్తానని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని చెప్పారు. అసోసియేషన్ కార్యాలయ స్థలం కోసం కలెక్టర్ కు లేఖ రాశానని, త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

రాష్ట్రాభివృద్ధిలో కళాకారుల పాత్ర కీలకం: డిప్యూటీ స్పీకర్​ రామచంద్రు నాయక్​

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కళాకారుల పాత్ర అత్యంత కీలకమని డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్  అన్నారు. మన సంస్కృతి, నాగరికత, భవిష్యత్తు తారలను తీర్చిదిద్దడంలో కళాకారులు ప్రధాన భూమిక పోషించాలని ఆయన సూచించారు. సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ.. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించగలరని తెలిపారు.

 కార్యక్రమంలో తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్  అధ్యక్షుడు రాజశేఖర్ (శుభోదయం సుధాకర్), గౌరవ అధ్యక్షుడు పృథ్వీరాజ్, ఆల్ కమిటీ చైర్మన్ నండూరి రామ్, జనరల్ సెక్రటరీ బొయిడీ నూకరాజు, ట్రెజరర్ ఎస్సార్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్స్ పద్మా రేఖ, శ్రీనివాస్ రాథోడ్, ఆర్గనైజ్ సెక్రటరీ కేపీ రెడ్డి, జాయింట్ సెక్రటరీస్​ రామ్మోహన్, రజిని శ్రీకళ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశ, కమిటీ ఈసీ సభ్యులు, పీవీ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.

కలిసి ముందుకు సాగండి

‘‘సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దదని అనుకుంటారు.. కానీ జూనియర్ ఆర్టిస్టుల సమస్యలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ విషయం వరంగల్​లో నేను చదువుకుంటున్న సమయంలో తెలిసింది. ప్రభుత్వం తరఫున ఆర్టిస్టులకు పూర్తి భరోసా ఇస్తూ త్వరలోనే ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేస్త. కార్మికులకు సర్కారు నుంచి సాయం అందేలా చూస్త” అని మంత్రి వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు.

 పది యూనియన్లు కాకుండా అన్ని యూనియన్లు కలిసి ఒకే గొడుగు కిందికి వచ్చి సమస్యలు పరిష్కారం కలిసి కట్టుగా ముందుకు సాగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు.