ఇంటింటికీ బీజేపీ..రాష్ట్రవ్యాప్తంగా మొదలైన కార్యక్రమం

ఇంటింటికీ బీజేపీ..రాష్ట్రవ్యాప్తంగా మొదలైన కార్యక్రమం
  • నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన నేతలు 
  • ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను కలిసినట్టు వెల్లడి 
  • ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న ప్రోగ్రామ్ 

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ ప్రోగ్రామ్​లో భాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటింటికీ బీజేపీ’ ప్రోగ్రామ్​ మొదలుపెట్టారు. హైదరాబాద్​లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, కరీంనగర్​లో బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్, గోదావరిఖనిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సహా ఇతర నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు పాల్గొని ప్రచారం చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేతలు ఇంటింటికీ వెళ్లి మోదీ చేసిన అభివృద్ధిని వివరిం చారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిం ది? ఏయే స్కీమ్స్​అమలు చేస్తున్నది? తదితర వివరాలు తెలియజేశారు. ఇంటింటికీ పార్టీ స్టిక్కర్లు అంటించి పోస్టర్లు పంపిణీ చేశారు. రాష్ట్రానికి చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలంతా తమ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలను కలిశారు. ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిశామని సంజయ్ ప్రకటించారు. ప్రోగ్రామ్ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే: కిషన్ రెడ్డి 

కాంగ్రెస్, బీఆర్ఎస్​కు తేడా లేదని.. రెండూ ఒక్క టేనని కిషన్​రెడ్డి అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కట్టగట్టుకొని బీఆర్ఎస్​లో చేరారన్నారు. ‘ఇంటింటికీ బీజేపీ’లో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్​పేట్, నాంపల్లి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో త్యాగం చేస్తే ఏర్పడిన తెలంగాణ, ఓ కుటుంబం పాలైందని అన్నారు. ‘‘ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకున్నది. మళ్లీ రాష్ట్రాన్ని ఏలాలని అనుకుంటున్నది’’అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలంటే, తెలంగాణ  కోసం అమరులైన 1200  మంది ఆకాంక్షలు నెరవేరాలంటే.. బీఆర్ఎస్ కుటుంబ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతి అక్రమాలతో సంపాదించిన వేల కోట్లను ఓటర్లకు పంచి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. డబ్బులతో ప్రజలను మభ్యపెట్టలేరన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది?: లక్ష్మణ్ 

రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుందని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా ఆదరణ కోల్పోయిందన్నారు. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ లో లక్ష్మణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు కేటాయిస్తున్నా, నిధులే ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.