కొమురవెల్లి, వెలుగు: అర్చకులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి సమావేశం రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్ డి.వి.ఆర్. శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం ఆర్జిస్తున్న 686 దేవాలయాల్లో వేలాది మంది సిబ్బంది దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారని వీరిలో అత్యధికులు నేటికీ కేవలం రూ.1500 నుంచి రూ.6000 వేతనాలతో గడుపుతున్నారన్నారు.
దేవాలయాల్లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తాత్కాలిక, దినసరి వేతన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. పదవీ విరమణ చేసిన అర్చకులకు పెన్షన్ సౌకర్యం, పీఆర్సీ, ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే ఉద్యమానికి సిద్ధమవుతామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయశాఖ అధ్యక్షుడు కృష్ణమాచారి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ఆలయ చైర్మన్ నరసింహ రెడ్డి, దేవాలయ స్థానాచార్యులు మల్లన్న స్వామి, ప్రధాన అర్చకుడు మల్లికార్జున్, ఉప ప్రధాన అర్చకుడు సాంబయ్య, మల్లికార్జున్ భాస్కర్, రవి, వినయ్, బసవేశ్వర్, సాయి, ఏఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకుడు చంద్రశేఖర్, దేవాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, ఉమ్మడి జిల్లా దేవాలయాల సుమారు 400 మంది అర్చక ఉద్యోగులు పాల్గొన్నారు.
