- గత టెట్ కంటే 50 వేలకు పైగా పెరిగిన అప్లికేషన్లు
- ఈసారి పోటీలో సర్కారు, ప్రైవేట్ ఇన్ సర్వీస్ టీచర్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. శనివారం దరఖాస్తు గడువు ముగిసేసరికి దరఖాస్తుల సంఖ్య 2.37 లక్షలు దాటింది. గత టెట్‌లో 1,83,653 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లూ భారీగానే దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నవంబర్ 15 నుంచి టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. అదే నెల 29వ తేదీతో ముగిసింది. ఈసారి మొత్తం 2,37,754 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పేపర్1 కోసం 85,538 మంది, పేపర్ 2 కోసం 1,52,216 మంది అప్లై చేసుకున్నారు.
గత టెట్‌తో పోలిస్తే 54,101 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. ఈసారి సర్కారు స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. మొత్తం అప్లికేషన్లలో 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉండగా, మిగిలిన 1,66,084 మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు.
ఎడిట్ చేసేందుకు నేడు ఆఖరు..
దరఖాస్తుల్లో తప్పులు సవరణ చేసుకునేందుకు అభ్యర్థులకు విద్యా శాఖ అవకాశం కల్పించింది. డిసెంబర్ 1వ తేదీ వరకు https://schooledu.telangana.gov.inలో అప్లికేషన్ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది. కాగా, వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఆన్‌లైన్ పద్ధతిలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
