హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్స్, గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర సెక్రటేరియెట్‌లో సంక్షేమ శాఖ చీఫ్‌సెక్రటరీ సబ్యసాచి ఘోష్ రివ్యూ చేశారు.
ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల హాస్టల్ నిర్వహణలో ఉమ్మడి అంశాలను గుర్తించారు. విద్యార్థుల సంక్షేమం, హాస్టల్, మౌలిక వసతులు, ఆహార సరఫరా, వైద్యం, తనిఖీలు, నివేదికలు వంటి ముఖ్యమైన అంశాలకు సాఫ్ట్‌వేర్ తయారీలో ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించారు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
