- వర్షాకాలం, ఎల్‌నినో నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
- ఆగస్టు 1 నుంచి నెలపాటు పంపిణీకి రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు
- సన్నబియ్యం అందుబాటులో ఉండేలా సివిల్ సప్లైస్ శాఖ చర్యలు
- రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులు..3.20 కోట్ల మంది లబ్ధిదారులకు అందనున్న సన్నబియ్యం
- దాదాపు 6.45లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో దేశం లోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే రేషన్ బియ్యాన్ని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి వచ్చిన మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు ఆగస్టు 1 నుంచి 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీకి సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటున్నది. వర్షాకాలంలో రవాణా ఇబ్బందులు, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజ లకు ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆగస్టు 1 నుంచి 31వరకు పంపిణీ..
సాధారణంగా ప్రతి నెలా తొలి 15 రోజులపాటు మాత్రమే పనిచేసే రేషన్ షాపులు ఈ ప్రత్యేక పంపి ణీ కోసం ఆగస్టు నెలంతా తెరిచి ఉంచాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో లబ్ధిదారులు తమకు అనుకూలమైన రోజున రేషన్ షాపుకు వెళ్లి రేషన్ బియ్యాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. మూడు నెలల బియ్యం ఒకేసారి అందించేందుకు ఈ -పాస్ యంత్రంలో వరుసగా 3 సార్లు బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒకేసారి 3 నెలల బియ్యం అందించడం వల్ల ప్రజలు పదేపదే రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో పాటు వర్షాభావం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనా కుటుంబాలకు ఆహార కొరత లేకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.
3.20 కోట్ల లబ్ధిదారులకు అందనున్న సన్నబియ్యం
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 కోట్ల రేషన్ కార్డుల పరిధిలోని 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా దాదాపు 2.15 లక్షల టన్నులకు పైగా సన్నబియ్యం పంపిణీకి అవసరం. ఈ నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి దాదాపు 6.45లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా గోడౌన్ల నుంచి సన్న బియ్యం నిల్వలను సమీకరించనున్నారు. ఈ క్రమం లోనే సన్న వడ్లు మిల్లింగ్ స్పీడప్ చేయాలని మిల్లర్లకు సివిల్ సప్లై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక రవాణా ప్రణాళిక రూపొందించారు. చిన్న రేషన్ షాపులకు ఒకేసారి, పెద్ద రేషన్ షాపులకు అవసరాన్ని బట్టి రెండు, మూడు విడతల్లో బియ్యం తరలించేలా చర్యలు చేపట్టారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులకు కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున మూడు నెలలకు సరి పడా బియ్యం అందజేయనున్నారు. అంత్యోదయ కార్డుదారులకు నెలకు 35 కిలోల బియ్యంతోపాటు కిలో చక్కెర, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల సన్నబియ్యంతో పాటు 5 కిలోల గోధుమలు
అందించనున్నారు.
రేషన్ లబ్ధిదారులకు ఈ కేవైసీ తప్పనిసరి..
రేషన్ పొందేందుకు లబ్ధిదారులు ఈ -కేవైసీ తప్పనిసరి చేయించాలని అధికారులు స్పష్టం చేశారు. జులై 31లోపు ఈ -కేవైసీ పూర్తి చేసుకున్న వారికి రేషన్ పంపిణీ జరిగేలా జాతీయ సమాచార వ్యవస్థ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్చేస్తోంది. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న కార్డుదారులు గడువులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. వలస కూలీలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు సొంత గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా సమీప రేషన్ దుకాణంలో ఈ -కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు ఈ- కేవైసీ చేయించుకోకపోవడంతో గ్రామీణ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 100 శాతం కేవైసీ పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు.
