- ఎంబ్రియాలజిస్టులు, ఇతర సౌకర్యాలపై నివేదిక ఇవ్వండి: మంత్రి దామోదర
- సెక్రటేరియెట్లో జరిగిన సమీక్షలో అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం గాంధీ, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న ఐవీఎఫ్ సేవలను జిల్లాలకూ విస్తరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియోట్లో జరిగిన సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణలతో కలిసి ఫర్టిలిటీ సేవలపై చర్చించారు. గాంధీ, పేట్లబురుజు ఐవీఎఫ్ సెంటర్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు సుమారు 35 వేల మందికి సేవలు అందాయని, ప్రస్తుతం 490 జంటలకు చికిత్స కొనసాగుతోందన్నారు.
వీరిలో 23 మంది మహిళలు గర్భం దాల్చారని తెలిపారు. ఇదే విధానాన్ని జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అమలు చేసి, పేదలకు ఉచితంగా మెరుగైన సంతాన సాఫల్య చికిత్సలు అందించాలని సూచించారు. ఇందుకు అవసరమైన ఎంబ్రియాలజిస్టులు, ఇతర సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగే అన్ని ఐవీఎఫ్ చికిత్సల వివరాలను తప్పనిసరిగా కేంద్ర సరోగసీ పోర్టల్‌లో నమోదు చేయాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి, ప్రైవేట్ దోపిడీని అరికట్టి సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
