
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో శుక్రవారం నుంచి ‘చీఫ్ మినిస్టర్ బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్ ప్రారంభమవుతున్నది. రోజుకో వెరైటీ బ్రేక్ ఫాస్ట్‌ను స్టూడెంట్స్‌కు అందించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల హైస్కూల్లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారికంగా ప్రారంభిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని ఒక స్కూల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ స్కీమ్‌ను మొదలుపెడ్తారు. మిగిలిన అన్ని స్కూల్స్‌లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ దసరా నుంచి ప్రారంభం కానుంది. అయితే, దసరా నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నా.. ఎన్నికల కోడ్ రానుండటంతో ఓపెనింగ్ తేదీని ముందుకు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,147 గవర్నమెంట్ స్కూల్స్‌లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివే సుమారు 23 లక్షల స్టూడెంట్స్‌కు బ్రేక్ ఫాస్ట్ అందనుంది. ప్రతి రోజూ స్కూల్ టైమింగ్ కంటే 45 నిమిషాల ముందే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. కాగా, స్కీమ్ అమలుపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన డీఈవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
డ్రాపౌట్స్ తగ్గించేందుకే..: మంత్రి సబితారెడ్డి
సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్స్‌కు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాపౌట్స్ తగ్గించి, హాజరు శాతాన్ని పెంచేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యంతో మిడ్ డే మీల్స్ స్కీమ్ అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో 8వ తరగతి వరకే మిడ్ డే మీల్స్ స్కీమ్ అమలు చేస్తున్నారని, కానీ.. తెలంగాణలో 9,10 క్లాసులకూ అమలు చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం అదనంగా రూ.137 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ స్కీమ్ పర్యవేక్షణ బాధ్యతలను పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్లకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు.
బ్రేక్ ఫాస్ట్ ప్రారంభోత్సవానికి సీఎం దూరం
స్కూల్ స్టూడెంట్స్‌కు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అట్టహాసంగా ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. రావిర్యాల స్కూల్లో శుక్రవారం ఉదయం సీఎం కేసీఆర్ ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారని అనధికారింగా సమాచారం కూడా ఇచ్చారు. సీఎం రాక నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. కేసీఆర్ కొంత కాలంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఇంకా జ్వరం తగ్గకపోవడంతోనే ఆయన ఈ స్కీమ్ ఓపెనింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాతి రోజు ప్రగతి భవన్లో వినాయక చవితి పూజలో పాల్గొన్నారు. 18 రోజులుగా సీఎం బయట కనిపించడం లేదు. శుక్రవారం వస్తారని లీకులు వచ్చినా.. ఈ కార్యక్రమానికి ఆయన దూరంగానే ఉంటున్నారు.
బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ మెనూ ఇదే..
సోమవారం: ఇడ్లీ సాంబార్ లేదాగోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం: పూరి, ఆలూ కుర్మా లేదా రవ్వతో చేసిన టమాటా బాత్, చట్నీ
బుధవారం-: ఉప్మా, సాంబార్ లేదాకిచిడీ, చట్నీ
గురువారం: మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం: ఉగ్గాని/పోహా, మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం-: పొంగల్, సాంబార్ లేదా వెజ్ పులావ్, రైతా/ఆలూ కుర్మా
ప్రైమరీ, యూపీఎస్, హైస్కూల్ టైమింగ్స్..
ట్విన్ సిటీస్: ఉదయం 8 గంటల నుంచి
ఇతర జిల్లాల్లో: ఉ. 8:45 గంటల నుంచి