ఆడబిడ్డల భద్రత కోసం.. మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే హాస్టల్ బెడ్ బుకింగ్!

ఆడబిడ్డల భద్రత కోసం.. మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే హాస్టల్ బెడ్ బుకింగ్!
  • మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం
  • యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో హైదరాబాద్ వచ్చే ఆడబిడ్డల కోసం రాష్ట్ర విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ సరికొత్త డిజిటల్ సేవను అందుబాటులోకి తేనుంది. ఇకపై ఇంట్లోనే కూర్చొని ప్రభుత్వ వర్కింగ్ విమెన్ హాస్టల్స్ (సఖి సెంటర్లు)లో బెడ్ లను బుక్ చేసుకోనేలా మొబైల్ యాప్ ను తీసుకురానుంది. తమిళనాడులో విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వ హాస్టల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించిన మన రాష్ట్ర అధికారులు.. అదే తరహాలో ఇక్కడ కూడా యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేస్తున్నారు.

ఇందులో తక్కువ చార్జీలు ఉండటమే కాకుండా, సీసీ కెమెరాలతో కూడిన హై-సెక్యూరిటీని కల్పిస్తున్నారు. కేవలం పరీక్షలు రాయడానికో లేదా ఇంటర్వ్యూల కోసమో ఒకటి రెండు రోజులు నగరానికి వచ్చే వారికి ఇది వరం లాంటిదనే చెప్పవచ్చు. ప్రైవేట్ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖర్చులు భరించలేని వారు నామినల్ చార్జీలతో 1 లేదా 2 రోజుల కోసం కూడా బెడ్ బుక్ చేసుకోవచ్చు.

యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. సింగిల్ రూమ్ కావాలన్నా లేదా తక్కువ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డార్మిటరీ కావాలన్నా ఎంచుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రభుత్వ హాస్టళ్లలో 7 వేల మంది ఉంటున్నారు. విపరీతమైన డిమాండ్ దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా మరో 16 హాస్టళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో వీటి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి.