- అభ్యంతరాలు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం
- ఈనెల 20న సదరన్‌జోనల్ కౌన్సిల్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు కట్టి దిగువకు మనకు నీళ్లు రాకుండా చేస్తున్న కర్నాటక.. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంపునకు సిద్ధమైంది. దానికి తోడుగా అప్పర్‌భద్ర ప్రాజెక్టును చేపట్టి కృష్ణా బేసిన్లో మనకు మరణశాసనం రాసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు లేవనెత్తేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందుకు దక్షిణాది రాష్ట్రాలతో నిర్వహించే సదరన్‌జోనల్ కౌన్సిల్ (ఎస్జెడ్సీ) మీటింగే వేదిక కానుంది. ఈనెల 20న తమిళనాడులోని మహాబలిపురంలో 31వ ఎస్జెడ్సీ మీటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు హాజరై వారికి రావాల్సిన ఫండింగ్, అంతర్రాష్ట్ర వివాదాలు తదితర అంశాలపై చర్చిస్తారు.
ఇరిగేషన్‌పరంగా పొరుగు రాష్ట్రాలతో ఉన్న వివాదాలను మన అధికారులు లేవనెత్తనున్నారు. దానికి సంబంధించి ఎజెండా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం జాతీయ హోదా ఇచ్చిన కర్నాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్టుపై ప్రధానంగా అభ్యంతరాలు లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నది. తుంగభద్ర నదికి ఉపనది అయిన భద్ర నదిపై ఎగువన కర్నాటక 47 టీఎంసీల సామర్థ్యంతో అప్పర్ భద్ర ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నిర్మాణం, ఆల్మట్టి ఎత్తు పెంపు వంటి వాటితో దిగువన కృష్ణాకు లోటు సంవత్సరాల్లో వరద తగ్గిపోతున్నది.
ఇలాంటి సమయంలో అప్పర్‌భద్ర ప్రాజెక్టును నిర్మిస్తే కృష్ణాకు మరో సోర్స్ అయిన తుంగభద్ర నుంచి కూడా వరద ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ అప్పర్‌భద్రకు ఓకే చెప్పలేదు. కానీ, బ్రిజేష్ కుమార్ట్రిబ్యునల్ మాత్రం 65 శాతం డిపెండబిలిటీ కింద ఓకే చెప్పింది. దీనిపై ఇప్పటికే ఏపీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. అందులో మన రాష్ట్రం కూడా ఇంప్లీడ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్ట్‌తో మన రాష్ట్రానికి ఎలా అన్యాయం జరుగుతుందో చెప్పి కర్నాటకను నిలువరించేలా చేయాలని కేంద్రాన్ని అడిగేందుకు ఎస్జెడ్సీని వేదికగా మార్చుకోవాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.
పాలమూరు అనుమతులపైన..
కృష్ణా బేసిన్లో అత్యంత ముఖ్యమైన పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై ఆ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. పర్యావరణ అనుమతులకు సంబంధించి పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకూ అనుమతులు ఇవ్వొచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని ఎస్జెడ్సీ ముందు పెట్టాలని భావిస్తున్నారు. కావేరి లింక్‌పై చర్చించేందుకు తమిళనాడు సిద్ధమవుతున్న నేపథ్యంలో, అందులో భాగంగా గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి చేపడితే తెలంగాణకు రావాల్సిన వాటా 74 టీఎంసీలతోపాటు మరికొన్ని డిమాండ్లను కేంద్రం ముందు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. పోలవరం–బనకచర్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
