వన్యప్రాణుల రక్షణకు రెస్క్యూ వెహికల్స్..జూ పార్కులకు అంతర్జాతీయ హంగులు: మంత్రి కొండా సురేఖ 

వన్యప్రాణుల రక్షణకు రెస్క్యూ వెహికల్స్..జూ పార్కులకు అంతర్జాతీయ హంగులు: మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ, అడవుల అభివృద్ధికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపా రు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్లను బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రంలోని జూ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.

వన్య ప్రాణుల రక్షణ కోసం అత్యాధునిక రెస్క్యూ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.  బుధవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (టీసీఎఫ్) పాలక మండలి, తెలంగాణ జూ పార్క్స్ అథారిటీ 15వ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఏపీఓ)తో పాటు జూ పార్క్స్ అథారిటీ బడ్జెట్ ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది.