ధాన్యం స్టోరేజీకి ఫంక్షన్‌‌ హాళ్లు..నిల్వ కెపాసిటీ పెంచేలా చర్యలు తీసుకోండి : సివిల్‌‌ సప్లయ్స్‌‌ కమిషనర్‌‌ స్టీఫెన్‌‌ రవీంద్ర

ధాన్యం స్టోరేజీకి ఫంక్షన్‌‌ హాళ్లు..నిల్వ కెపాసిటీ పెంచేలా చర్యలు తీసుకోండి : సివిల్‌‌ సప్లయ్స్‌‌ కమిషనర్‌‌ స్టీఫెన్‌‌ రవీంద్ర
  •     అధికారులతో సివిల్‌‌ సప్లయ్స్‌‌ కమిషనర్‌‌ స్టీఫెన్‌‌ రవీంద్ర సమీక్ష

హైదరాబాద్‌‌, వెలుగు: రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి సరిపడా నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సివిల్‌‌ సప్లయ్స్‌‌ కమిషనర్‌‌ స్టీఫెన్‌‌ రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం సివిల్‌‌ సప్లయ్స్‌‌ భవన్‌‌లో వానకాలం సీజన్‌‌ 2026-–27 ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం నిల్వ, రవాణా, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులపై చర్చించి ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా కమిషనర్‌‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గోదాములతో పాటు మార్కెట్‌‌ యార్డులు, ఖాళీ పారిశ్రామిక షెడ్లు, ఫంక్షన్‌‌ హాళ్లు, ఖాళీ ప్రదేశాలు, క్యాప్‌‌ స్టోరేజీలను ధాన్యం నిల్వకు వినియోగించుకోవాలని కమిషనర్‌‌ సూచించారు. ప్రస్తుతం ఉన్న పాత ధాన్యం నిల్వలను త్వరగా తరలించి.. కొత్త పంటకు గోదాములను సిద్ధం చేయాలని ఆదేశించారు. 

మెషీన్లతో రైతుల టైమ్‌‌ సేవ్‌‌..

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆధునీకరించేందుకు ఆటోమేటిక్‌‌ ప్యాడీ క్లీనర్లు, మెకానికల్‌‌ స్టాకర్ల కొనుగోలు ప్రక్రియపై సమావేశంలో సమీక్షించారు. ఈ మెషీన్లతో పనులు వేగంగా పూర్తవడంతో రైతుల టైమ్‌‌ సేవ్‌‌ అవుతుందని తెలిపారు. భవిష్యత్‌‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘ఫార్మ్‌‌ టు సైలో’ విధానాన్ని అమలు చేసే అంశంపైనా చర్చించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ, సెర్ప్‌‌, స్టేట్‌‌ వేర్‌‌హౌసింగ్‌‌ కార్పొరేషన్‌‌, మార్క్‌‌ఫెడ్‌‌, సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.