- పీఏఐ 2.0లో వెల్లడి.. 86.41 స్కోర్‌తో టాప్‌లో నిలిచిన రాష్ట్రం
- తెలంగాణకు కనీసం పోటీ ఇవ్వలేకపోయిన బీజేపీ పాలిత రాష్ట్రాలు
- స్టేట్ బెస్ట్ పర్ఫార్మింగ్ పంచాయతీగా విట్టునాయక్ తండా
- చిన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా త్రిపుర
న్యూఢిల్లీ, వెలుగు : పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ (పీఏఐ) 2.0లో తెలంగాణ రాష్ట్రం 86.41 పాయింట్లతో దేశంలోన్ నంబర్‌వన్‌గా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 12,556 గ్రామ పంచాయతీలకుగానూ.. 624 జీపీలు ఎ–గ్రేడ్ సాధించాయి. గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రగతిని మదింపు చేసేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తాజాగా పీఏఐ 2.0 (2023–-24) రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా పంచాయతీలను ఐదు గ్రేడ్‌లుగా (ఏ+, ఏ, బీ, సీ, డీ) వర్గీకరించారు. దేశవ్యాప్తంగా ఒక్క పంచాయతీ కూడా ఓవరాల్‌గా ‘ఎ+’ (90కి పైగా స్కోర్) గ్రేడ్‌ను సాధించలేకపోయింది. ఏ గ్రేడ్ (75 నుంచి 90 లోపు స్కోర్)లో దేశవ్యాప్తంగా 3,635 జీపీలు నిలవగా.. వీటిలో తెలంగాణ నుంచి ఏకంగా 624 పంచాయతీలు చోటు దక్కించుకున్నాయి.
పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఏపీ (591), ఒడిశా (555) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా10,056 జీపీలు బి గ్రేడ్‌లో (60–75 స్కోర్), 1,853 పంచాయతీలు సి–గ్రేడ్‌లో (40–60 స్కోర్) నిలిచాయి. 23 జీపీలు డి–గ్రేడ్(40 లోపు స్కోర్)కు పరిమితమయ్యాయి. కాగా, కేవలం 1,176 గ్రామ పంచయతీలు ఉన్న ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 943 పంచాయతీలు ఎ–గ్రేడ్‌లో స్థానం దక్కించుకున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్84.67 పాయింట్లతో పెద్ద రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో మొత్తం 13,310 పంచాయతీలు ఉండగా.. 591 జీపీలు ఏ -గ్రేడ్ సాధించాయి.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు..
గ్రామీణ ప్రాంతాల్లో 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ పీఏఐని తెచ్చింది. పారిశుధ్యం, ఆరోగ్యం, పాలన, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు, పర్యావరణ సుస్థిరత లాంటి కీలక రంగాల్లో పంచాయతీల పనితీరును ఇది అంచనా వేస్తుంది. గతంలో విడుదల చేసిన పీఏఐ 1.0లో 516 ఇండికేటర్లు ఉండగా, 2.0లో వాటిని మరింత సులభతరం చేస్తూ 150 ఇండికేటర్లకు కుదించారు.
డేటా నమోదులో పారదర్శకత కోసం గ్రామసభల ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 2,66,999 పంచాయతీలు ఉండగా.. ఈ ఏడాది అత్యధికంగా 97.30 శాతం (2,59,867) పంచాయతీలు ఈ సూచీలో పాల్గొన్నాయి. గతేడాది ఈ భాగస్వామ్యం 80.79 శాతమే.
బీజేపీ పాలిత రాష్ట్రాల పేలవ ప్రదర్శన
పీఏఐ 2.0లో తెలంగాణతో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమాత్రం పోటీ పడలేకపోయాయి. తెలంగాణ 86.41 స్కోర్‌తో ఆదర్శంగా నిలవగా.. గుజరాత్ (79.85), యూపీ (79.47), మహారాష్ట్ర (82.01), మధ్య ప్రదేశ్ (78.88), హరియాణా(76.95) పాయింట్లతో వెనకంజలో ఉన్నాయి. అలాగే, ‘ఏ’ గ్రేడ్‌లోనూ ఈ రాష్ట్రాలు పేలవమైన ప్రదర్శనే చూపాయి. గుజరాత్‌లో 14,534 గ్రామ పంచాయతీలు ఉంటే.. 75 మాత్రమే ఏ గ్రేడ్‌లో నిలిచాయి. మధ్యప్రదేశ్‌లో 23,011 జీపీలకు గానూ 33, మహారాష్ట్రలో 27,894 పంచాయతీలకు గానూ 315, రాజస్థాన్‌లో 11,037 జీపీలకు 8, అత్యధికంగా 57,678 గ్రామ పంచాయతీలున్న ఉత్తరప్రదేశ్‌లో 51 మాత్రమే ఈ కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి.
విట్టునాయక్‌తండాకు 86.41 పాయింట్లు
తెలంగాణలోని 31 జిల్లాలు, 553 బ్లాక్‌ల పరిధిలో ఉన్న 12,556 గ్రామ పంచాయతీలు వంద శాతం తమ వివరాలను పక్కాగా నమోదు చేశాయి. ఇందులో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి బ్లాక్‌కు చెందిన విట్టునాయక్ తండా 86.41 పాయింట్లు సాధించి ఏ గ్రేడ్‌తో రాష్ట్రంలోనే స్టేట్ బెస్ట్ ఫర్ఫార్మింగ్పంచాయతీగా నిలిచింది. అలాగే, ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పంచాయతీల పనితీరును 9 థీమ్స్ ఆధారంగా విభజించారు.
ఓవరాల్‌గా రాష్ట్రం నుంచి ఏ పంచాయతీ ‘ఎ+’ గ్రేడ్‌ను దక్కించుకోకపోయినప్పటికీ.. ఒక్కో నిర్దిష్ట కేటగిరీలో మాత్రం 90కి పైగా స్కోర్‌తో రాష్ట్రానికి చెందిన 8 పంచాయతీలు ‘ఎ+’(అచీవర్) గ్రేడ్ సాధించాయి. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని వెంకటంపల్లి రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది.
కేటగిరీల వారీగా..
పావర్టీ ఫ్రీ–మెరుగైన జీవనోపాధి పంచాయతీ : నల్గొండ జిల్లా వేములపల్లి బ్లాక్ రావులపెంట (97.50 స్కోర్, ఏ+ గ్రేడ్)
హెల్తీ పంచాయతీ : నిర్మల్ జిల్లా కుంటాల బ్లాక్ వెంకూర్(91.33 స్కోర్, ఏ+ గ్రేడ్)
చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ బ్లాక్ వెంకటంపల్లి (96.67 స్కోర్, ఏ+ గ్రేడ్)
వాటర్ సఫిసియెంట్ పంచాయతీ: వరంగల్ జిల్లా నర్సంపేట బ్లాక్ పాత మఖ్దూంపురం (95.00 స్కోర్, ఏ+ గ్రేడ్)
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ : వరంగల్ జిల్లా దుగ్గొండి బ్లాక్ నారాయణ తండా (95.71 స్కోర్, ఏ+ గ్రేడ్)
సెల్ఫ్ సఫీషియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ: హనుమకొండ జిల్లా ఐనవోలు బ్లాక్ ఉడుతగూడెం (92.50 స్కోర్, ఏ+ గ్రేడ్)
సోషల్లీ జస్టిస్, సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ బ్లాక్ వెంకటంపల్లి (88.82 స్కోర్, ఏ గ్రేడ్)
గుడ్ గవర్నెన్స్ పంచాయతీ : వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి బ్లాక్ మోతుకుపల్లె (90.42 స్కోర్, ఏ+ గ్రేడ్)
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ: సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి బ్లాక్ ఫసల్‌వాడీ (93.24 స్కోర్)

