- గత సర్కార్ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణ పనులు
- అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టూరిజం కార్పొరేషన్ చర్యలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన హరిత హోటళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. మూడేండ్ల క్రితమే గత సర్కార్ హయాంలో మధ్యలో ఆగిపోయిన ఈ హోటళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్(బీఓటీ) మోడల్లో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ హోటళ్లను నిర్వహించనున్నారు. ఎంపికైన డెవలపర్ తమ నిధులతో పెండింగ్ పనులు పూర్తిచేసి, నిర్ధిష్ట కాలంపాటు నిర్వహించి, ఆ తర్వాత తిరిగి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ అయ్యాక రెండేళ్లలో హోటళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే నిబంధన విధించారు.
2 ఎకరాల్లో కరీంనగర్ హోటల్
ఉత్తర తెలంగాణలో ప్రధాన వ్యాపార, విద్య, పర్యాటక జిల్లాగా పేరున్న కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఇప్పటి వరకు టూరిజం హోటల్ లేదు. ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో కరీంనగర్–సిరిసిల్ల బైపాస్ రోడ్డులో జీప్లస్ 3 పద్ధతిలో 2 ఎకరాల్లో హరిత హోటల్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు జీప్లస్ వన్ వరకు స్లాబ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటికే రూ.20 కోట్లు వెచ్చించారు. ప్రతి ఫ్లోర్‌లో 29,700 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో మొత్తం 59,400 చ.అడుగుల విస్తీర్ణం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కమర్షియల్ స్పేస్ 7,200 చ.అడుగులు, హోటల్ ఎంట్రీ లాబీలు, రెస్టారెంట్, బార్, బ్యాంక్వెట్ హాళ్లు ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఫ్లోర్ లో కమర్షియల్ స్పేస్ 9,550 చ.అడుగులతోపాటు, 24 గెస్ట్ రూమ్‌లు నిర్మించాలని ప్లాన్ సిద్ధం చేశారు.
ఈ పనులు అసంపూర్తిగా ఉండడంతో జీప్లస్ టూ లేదా జీ ప్లస్ 3లో ప్రాజెక్ట్ పూర్తి లీజు కాలం వరకు నిర్వహించి.. ఆ తర్వాత తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రైవేట్ డెవలపర్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే మార్గంలో ఉన్న కరీంనగర్లో పర్యాటకులు, భక్తులు స్టే చేసే అవకాశం ఉండడంతో హరిత హోటల్ కు డిమాండ్ ఉంటుందని టూరిజం శాఖ అధికారులు వెల్లడించారు.
సిరిసిల్లలోనూ పెండింగ్ లోనే..
సిరిసిల్లలోనూ ఎకరంన్నర విస్తీర్ణంలో అపెరల్ పార్క్ సమీపంలో టూరిజం హోటల్ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ జీప్లస్ 3 బిల్డింగ్ నిర్మించాలని భావించినప్పటికీ జీప్లస్ 1 నిర్మించారు. ఇప్పటివరకు రూ.9 కోట్లు ఖర్చు చేశారు. ఈ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో లాబీ/వెయిటింగ్ ఏరియా, 100 సీట్ల కెపాసిటీతో రెస్టారెంట్, కిచెన్, 12 డీలక్స్ రూమ్ లు, సూట్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్ లో 35 సీట్లతో బార్, 500 సీటింగ్ తో బాంక్వెట్ హాల్, 18 మంది కూర్చునేలా బోర్డు రూమ్, 12 డీలక్స్ రూమ్ లు, సూట్ రూమ్, టెర్రాస్ గార్డెన్ నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా మధ్యలోనే ఆగిపోయింది.
