
రాష్ట్ర ఖజానా లోటుకు గురవుతుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఫ్రీ పథకాల అమలుతో పోతున్న సొమ్మును జరిమానాలతో రాబట్టుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటోంది. ప్రజలకు ప్రభుత్వాలు చేసే దారి దోపిడీ గురించి పట్టదు. ఉచిత పథకాలతో ఎంత లబ్ది చేకూరిందనే చూస్తున్నారు. కొత్తగా ‘ప్రాణ రక్షణ’ ట్యాగ్‌తో సామాన్యులపై అధికారిక వసూళ్లకు పాల్పడుతోంది ప్రభుత్వం. ఆబ్కారీ ఆదాయం కోసం విచ్చలవిడిగా వైన్ షాపులకు లైసెన్స్లిచ్చేస్తోంది. అనధికారికంగా లైసెన్స్ లేని బెల్ట్ షాపులు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్నాయి.
తాగడానికి, తాగి ఊగడానికి బార్లు, రెస్టారెంట్లలో సిట్టింగ్ లు ఏర్పరచడం, వాటికి రాత్రి పది గంటల వరకు అనుమతులు ఇవ్వడం, తీరా తాగేసి ఇంటికి వెళదామంటే ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ చెకింగ్‌లతో ఎక్కడా లేని నిబంధనలు. సామాన్య పౌరుల ప్రాణ రక్షణ పట్ల ప్రభుత్వాలకు బాధ్యత ఉన్నట్లయితే బార్లు, రెస్టారెంట్లకు అనుమతులెందుకు ఇవ్వాలి? వాటికి రాత్రి 10 గంటల వరకు ఎందుకు సిట్టింగ్ అనుమతులు ఇవ్వాలి? అసలు అనుమతులు ఇవ్వనట్లయితే… మద్యం తాగిన ప్రతి ఒక్కరినీ దోషిగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. కానీ, తప్పు చేయడానికి ప్రభుత్వమే ప్రోత్సహించి, ఆ తప్పు చేసినందుకు మళ్లీ ప్రభుత్వమే శిక్ష విధించడం బహుశా బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా జరగలేదేమో!
మద్యం ఆరోగ్యానికి హానికరం.. మద్య సేవించి వాహనం నడపడం ప్రాణానికి ప్రమాదకరం. అలాంటప్పుడు మద్య నిషేధం చేసి ప్రజల ప్రాణాలపట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చుగా! రెండు విధాలైన ఆదాయం పోతుందన్న భయంతో మద్య నిషేధం జోలికి వెళ్లడం లేదు. తాగడం వల్ల వచ్చే ఆబ్కారీ ఆదాయం, తాగి వాహనం నడపడం వల్ల వచ్చే జరిమానాల సొమ్ము… రెండూ పోయినట్లయితే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందని భయం. ఇదీ ప్రభుత్వాలు బార్లు, రెస్టారెంట్లు, బెల్టు షాపుల పేరుతో ఒకపక్క.. డ్రంక్ అండ్ డ్రైవ్ పెనాల్టీలతో మరో పక్క సామాన్యుల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న తీరు. తాగడం.. తాగి వాహనం నడపడాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. అలాగని ప్రభుత్వమే ప్రోత్సహించి, మరలా అదే సర్కారు జరిమానాల పేరుతో వసూళ్లు చేయడం ఎంతవరకు సమంజసం?
ఇక ట్రాఫిక్ జరిమానాల పెంపుదల విషయానికొస్తే.. ఇదివరలో 100 నుండి 1000 రూపాయల వరకు ఉన్న జరిమానాలు ప్రస్తుతం 500 నుండి 10,000 వరకు పెంచేశారు. తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సిన వెహికల్ డాక్యుమెంట్ల విషయంలో ఇదివరలో 50 నుండి 1500 రూపాయల వరకు ఉన్న ఫైన్లను అమాంతం వెయ్యి నుండి 40,000 వరకు పెంచేశారు. వీటికికూడా ‘సామాన్యుల ప్రాణ రక్షణ’ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. జరిమానాలు పెంచడంవల్ల యాక్సిడెంట్లు, రూల్స్ బ్రేక్ చేయడమనేవి ఎంతమేర తగ్గు ముఖం పడతాయో చెప్పలేం. దీనివల్ల జనంలో భయం కంటే ట్రాఫిక్వారికి ఎంతో కొంత ముట్టజెప్పి తప్పించుకుందామనే ఆలోచన పెరుగుతుంది. ఉదాహరణకు,10 వేలు జరిమానా కట్టాల్సి వస్తే ట్రాఫిక్వారితో లాలూచీ పడే అవకాశం లేకపోలేదు. ఈ పెరిగిన జరిమానాలు ప్రభుత్వానికి, ట్రాఫిక్ సిబ్బందికి వరంగా మారితే, సామాన్యుల పాలిట శాపంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ‑ శ్రీనివాస్ గుండోజు