ఆర్టీసీలో 48,533 మంది కార్మికులపై వేటు

ఆర్టీసీలో 48,533 మంది కార్మికులపై వేటు
  • ప్రైవేటు, ఆర్టీసీ కలిస్తేనే సంస్థకు మంచిది
  • తక్షణం 2,500 అద్దె బస్సులు తీసుకుంటున్నం
  • ఇప్పుడిక ఆర్టీసీ కార్మికులు 1,200 మందిలోపే
  • యూనియన్లతో ఎలాంటి చర్చలుండవ్
  • అతి త్వరలోనే కొత్త సిబ్బందిని నియమిస్తం
  • కొత్తగా చేరెటోళ్లు ఏ యూనియన్​లోనూ చేరబోమని రాసియ్యాలి
  • 15 రోజుల్లోనే పూర్వ స్థితికి ఆర్టీసీని తెస్తం
  • రెండుమూడేండ్లలో సంస్థ లాభాల్లోకి వస్తది
  • సమ్మెపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, వెలుగుఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ‘‘గడప దాటినోళ్లు బయటికే.. మళ్లీ గడపలోకి వచ్చే సమస్యే లేదు.. డ్యూటీకి రానోళ్లను మళ్లా ఉద్యోగంలోకి తీసుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆర్టీసీ సిబ్బంది 1,200 మంది లోపే” అని సీఎం కేసీఆర్​ తేల్చిచెప్పారు. త్వరలోనే కొత్త సిబ్బందిని నియమిస్తామని, తక్షణమే 2,500 అద్దె బస్సులను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని అన్నారు. ఇక ముందు ఆర్టీసీలో సగం బస్సులు ప్రైవేటువే ఉంటాయని పేర్కొన్నారు. ప్రైవేటు, ఆర్టీసీ కలిస్తేనే సంస్థకు మంచిదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 49,733 మంది కార్మికులు ఉండగా.. వారిలో 1200 లోపు మందినే సిబ్బందిగా గుర్తిస్తామని సీఎం చెప్పడంతో మిగతా సుమారు 48,533 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లే. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘‘విలీనం గురించి అఖిలపక్ష సమావేశం జరుపాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నరు.. వాళ్లకు ఆర్టీసీ గురించి మాట్లాడే హక్కు లేదు” అని మండిపడ్డారు. ఇక నుంచి ఆర్టీసీ యూనియన్లతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరుపబోదని స్పష్టం చేశారు.‘‘ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ లాంటి సమస్యలు ప్రభుత్వాన్ని బ్లాక్‌‌ మెయిల్ చేసే విధంగా మారాయి” అని కేసీఆర్​ అన్నారు. ఇప్పుడు ఆర్టీసీలో చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమని, ఈ ఆలోచనే తప్పిదమని, బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అతి త్వరలో కొత్త సిబ్బంది

ప్రభుత్వం విధించిన గడువులోపల డ్యూటీకి రానోళ్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని సీఎం తెలిపారు. ఇప్పుడు ఆర్టీసీలో  1,200 మంది లోపు సిబ్బందే మిగిలారని, వారినే సిబ్బందిగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీకి అవసరమైన సిబ్బంది నియామకం అతిత్వరగా చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరబోమని అగ్రిమెంట్‌‌పై సంతకం చేయాలని, వాళ్లకు కండీషన్లతో కూడిన ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రతి ఉద్యోగికి ప్రొబేషన్‌‌ పీరియడ్‌‌ ఉంటుందని తెలిపారు. ఏ ఏ కేటగిరి చెందిన సిబ్బంది సమ్మెకు వెళ్లారో ఆయా కేటగిరిల్లో సిబ్బందిని భర్తీ చేయడానికి రిక్రూట్‌‌మెంట్‌‌ ఉంటుందని ప్రకటించారు.

ఆర్టీసీలో సగం ప్రైవేటే

ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివని సీఎం తేల్చిచెప్పారు. ‘‘ఈ పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయి. రెండు- మూడేండ్లలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుంది” అని ఆయన అన్నారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని ఆదేశించారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ సునీల్‌‌శర్మ నేతృత్వంలో, కమిషనర్‌‌ సందీప్‌‌కుమార్‌‌ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు, జేటీసీ  సభ్యులుగా కమిటీని నియమిస్తున్నామని సీఎం చెప్పారు. ఈ కమిటీ అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి, సోమవారం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు.  ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తక్షణ చర్యగా 2,500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకొని నడిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 4,114 ప్రైవేట్‌‌ బస్సులున్నాయని, స్టేజ్‌‌ క్యారియర్‌‌ చేస్తే వాళ్లు కూడా ఆర్టీసీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆర్టీసీ, ట్రాన్స్‌‌పోర్ట్‌‌ అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు.

రాజీ సమస్యే లేదు

ఆర్టీసీ ఏటా రూ.1,200 కోట్ల నష్టాల్లో ఉందని, రూ.5 వేల కోట్ల అప్పులు సంస్థపై ఉన్నాయని, వరుసగా పెరుగుతున్న డీజిల్‌‌ ధరలతో సంస్థ ఇబ్బందుల్లో ఉందని సీఎం తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో, పండుగ సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ చేసుకునే సమస్యే లేదని తేల్చిచెప్పారు. వాళ్లు చేసింది తీవ్రమైన తప్పిదమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమ్మె మీద ప్రజలు కోపంగా ఉన్నారని, సోషల్‌‌ మీడియాలో కూడా వాళ్ల మీద వ్యతిరేకత వస్తోందని తెలిపారు.

వాళ్లు విలీనం చేసిండ్రా?

‘‘సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమబెంగాల్‌‌లో ఆర్టీసీని విలీనం చేశారా? ఇప్పడు అధికారంలో ఉన్న కేరళలో చేశారా? బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది అక్కడ చేశారా? కాంగ్రెస్‌‌ ప్రభుత్వాలు ఎక్కడైనా చేశాయా?” అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి కళ్లూ తెరిపించాలని, భవిష్యత్‌‌లో ఆర్టీసీని ఏం చేయాలన్నా ప్రజలను దృష్టిలో ఉంచుకొనే చెయ్యాలని అన్నారు. ‘‘మంచి నైపుణ్యం, వృత్తిపరమైన మేనేజ్‌‌మెంట్‌‌ ఉన్నది. అన్ని విధాలా స్థిరత్వం సాధించుకుంటాం. ప్రైవేట్‌‌ భాగస్వామ్యం, ఆర్టీసీ యాజమాన్యం ఉంటనే మంచిగ ఉంటది. అందుకే సమతుల్యం పాటించే నిర్ణయం తీసుకున్నం’’ అని తెలిపారు.  ఆర్టీసీ మేనేజ్‌‌మెంట్‌‌కు ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని, కార్గో సర్వీస్‌‌ నుంచి కూడా లాభాలు రాబట్టాలని అధికారులకు సూచించారు. అనేక రంగాల్లో ముందున్న తెలంగాణ ఆర్టీసీలోనూ ముందుండాలని అన్నారు.

హైదరాబాద్‌‌లో ఆర్టీసీకి వచ్చే నష్టాలను ప్రభుత్వం భరిస్తోందని, సంస్థలో ప్రస్తుతం 10,400 బస్సులుండగా, రోజు కోటి మంది వరకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌‌లో కూడా ఈ సౌకర్యం కొనసాగుతుందని చెప్పారు. సమీక్ష సమావేశంలో మంత్రులు అజయ్‌‌కుమార్‌‌, ప్రశాంత్‌‌రెడ్డి, సీఎస్‌‌ ఎస్‌‌కే జోషి, డీజీపీ మహేందర్‌‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌‌శర్మ, స్పెషల్‌‌ సీఎస్‌‌  సోమేశ్‌‌కుమార్‌‌, సీనియర్‌‌ అధికారులు సునీల్‌‌శర్మ, నర్సింగ్‌‌రావు తదితరులు పాల్గొన్నారు.