ఉద్యోగ నోటిఫికేషన్స్ వేయాలి : ఆర్.కృష్ణయ్య

ఉద్యోగ నోటిఫికేషన్స్ వేయాలి : ఆర్.కృష్ణయ్య
  • ఈ 31న నిరుద్యోగుల సింహగర్జన
  • సభ పోస్టర్​ ఆవిష్కరించిన ఆర్​.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: మెగా డీఎస్సీతో పాటు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత పదేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జనవరి 31న ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జన సభ జరగనుంది.

ఇందుకు సంబంధించిన పోస్టర్​ను విద్యానగర్ బీసీ భవన్​లో ఆర్. కృష్ణయ్య గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించి నోటిఫికేషన్ వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

కల్లబొల్లి మాటలు నమ్మం: నిరుద్యోగ జేఏసీ

మంత్రులు చెప్పే కల్లబొల్లి మాటలను నిరుద్యోగులు నమ్మే పరిస్థితుల్లో లేరని నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్ర నాయక్ అన్నారు.  గురువారం చిక్కడపల్లిలోని సిటీ సెంటర్ లైబ్రరీలో నిరుద్యోగులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  40 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఎక్కడ ఎలా భర్తీ చేశారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఏం చేస్తుందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.