- నేడు అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు
- రానున్న మూడు నెలల్లో 9.60 లక్షల ఇంకుడుగుంతలు, 25 వేల పంట కుంటల నిర్మాణం
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. వీబీజీ రామ్ జీ పథకం కింద రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడంతోపాటు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడుతోంది.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్ ఉన్నతాధికారులతో కలిసి సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కొరత రాకుండా చూసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 నాటికి మొత్తం 12 కోట్ల పని దినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలి దశ కింద అక్టోబర్ వరకు 4.5 కోట్ల పని దినాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించి భూగర్భ జలాలను పెంచడానికి రానున్న మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున జల సంరక్షణ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 9.60 లక్షల ఇంకుడు గుంతలు (సోక్ పిట్లు), 25,000 పంట కుంటలు (ఫాం పాండ్స్), 5,000 ఊట కుంటలు (పెర్కోలేషన్ ట్యాంకులు), 5,000 బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు.
ప్రతి గ్రామంలో ఇళ్ల వద్ద సోక్ పిట్లు, సాగు భూముల్లో పంట కుంటలు, వర్షపు నీటిని నిల్వ చేసే పెర్కొలేషన్ ట్యాంకులు నిర్మించడం ద్వారా ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఉన్నతాధికారులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అవసరమైతే మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో పనులు వేగంగా ప్రారంభమయ్యేలా కలెక్టర్లు, సంబంధిత అధికారులు నేరుగా పర్యవేక్షించాలని మంత్రి సీతక్క ఆదేశించారు
