హైదరాబాద్, వెలుగు: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు, ఎంపీలు ఈ గెలుపుపై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం, ఆయన రాజకీయ వ్యూహాల వల్లే కేరళలోని 140 స్థానాల్లో యూడీఎఫ్ దాదాపు 100 సీట్లు గెలుచుకున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రశంసించారు.
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని రేవంత్ కోరడం కేరళ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుందని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కేరళలో యూడీఎఫ్ విజయం నాంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ కలలు కంటున్న ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అసాధ్యమని.. కాంగ్రెస్‌తోనే దేశం ‘బీజేపీ ముక్త్ భారత్’ అవుతుందని చెప్పారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల తర్వాత జాతీయ కాంగ్రెస్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా రేవంత్ రెడ్డి ఎదిగారని విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో గుజరాత్, యూపీ ఎన్నికల్లో కూడా ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా క్రియాశీలక పాత్ర పోషిస్తారని వెల్లడించారు.సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం వల్లే కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిందని విప్ అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిని కేరళ ప్రజలు గుర్తించారని, అందుకే రేవంత్ చెప్పిన అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సానుకూలంగా స్వీకరించారని విప్ బల్మూరి వెంకట్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కేరళ ప్రజలు కోరుకోవడం వల్లే అక్కడ యూడీఎఫ్ గెలిచిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ చెప్పారు. కేరళ మేనిఫెస్టోను రేవంత్ రెడ్డి విడుదల చేయడం యూడీఎఫ్ కు కలిసి వచ్చిందని పేర్కొన్నారు.
