సెప్టెంబర్ 26 నుంచి వైన్స్ అప్లికేషన్లు..అక్టోబర్ 18 దాకా గడువు.. 23న లక్కీ డ్రా

సెప్టెంబర్ 26 నుంచి  వైన్స్ అప్లికేషన్లు..అక్టోబర్ 18 దాకా గడువు.. 23న లక్కీ డ్రా
  •     డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం
  •     మొత్తం 2,620 లిక్కర్ ​షాపులకు నోటిఫికేషన్ 
  •     గౌడ్స్‌‌‌‌‌‌‌‌కు 393, ఎస్సీలకు 262,  ఎస్టీలకు 131 కేటాయింపు 
  •     అప్లికేషన్ ఫీజు 3 లక్షలు.. ఒక్కరు ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు 
  •     2 లక్షల దాకా అప్లికేషన్లు వస్తాయని అధికారుల అంచనా 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల కొత్త లైసెన్స్‌‌ల కోసం రాష్ట్ర సర్కార్ షెడ్యూల్​విడుదల చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్‌‌ 18 వరకు జిల్లాల వారీగా దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గైడ్‌‌లైన్స్ జారీ చేసింది. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. 

2025 డిసెంబర్‌‌ 1 నుంచి 2027 నవంబర్‌‌ 30 వరకు రెండేండ్ల కాలానికి ఎక్సైజ్‌‌ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 దుకాణాల్లో గౌడ్స్‌‌కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున కేటాయించారు. ఏ జిల్లాలో ఎక్కడ? ఏ షాప్‌‌? ఏ  రిజర్వేషన్ పరిధిలోకి వస్తుందనేది జిల్లాల్లో లక్కీ డ్రాలు తీసి ఫైనల్​చేశారు. ఇక ఈసారి వైన్స్​లకు టెండర్ దరఖాస్తు రుసుము రూ.3 లక్షలుగా నిర్ధారించారు. గతంలో ఇది రూ.2 లక్షలుగా ఉండేది. 

ఇక ఫస్ట్​ఇన్‌‌స్టాల్మెంట్​ఫీజును మద్యం దుకాణాలు కేటాయించిన రోజుగానీ, ఆ మరుసటి రోజుగానీ చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మద్యం దుకాణాలకు వచ్చే దరఖాస్తులు, ఫస్ట్​ఇన్‌‌స్టాల్‌‌మెంట్ చెల్లింపు ఫీజుల ద్వారా సర్కారుకు రూ.5 వేల కోట్ల దాకా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

వీరికి అవకాశం లేదు.. 

ఎక్సైజ్‌‌ చట్టం 1968 ప్రకారం శిక్ష పడినవారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయనివారు దుకాణాలు పొందేందుకు అనర్హులు. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు కూడా వైన్స్​లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక దుకాణానికి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టుకోవచ్చు. కానీ ప్రతి దరఖాస్తుకు నిర్దేశించిన ఫీజు చెల్లించాలి. ఈ దరఖాస్తు సొమ్ము తిరిగి వెనక్కి (రీఫండ్​) ఇవ్వరు. 

దరఖాస్తు ఫారంతో పాటు రూ.3 లక్షలను డీడీ లేదా చలాన్‌‌ రూపంలో చెల్లించిన రసీదు జత పరచాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌‌ కల్పించిన దుకాణాల్లో దరఖాస్తు చేసుకునేవారు కుల ధ్రువీకరణతోపాటు రూ.3 లక్షల డీడీ/చలాన్‌‌ జతపరచాలి. కులధ్రువీకరణ పత్రం సమయానికి అందని పక్షంలో నవంబర్​15వ తేదీ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. 

అండర్‌‌ టేకింగ్‌‌ పత్రాన్ని జతచేయాలి. డీడీలు లేదా చలాన్లను డీపీఓ (జిల్లా ప్రొహిబిషనర్‌‌ అండ్‌‌ ఎక్సైజ్‌‌ అధికారి) పేరుతో తీయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను జిల్లా ప్రొహిబిషన్​అండ్​ఎక్సైజ్​ కార్యాలయం, డిప్యూటీ కమిషనర్‌‌ ఆఫీస్, ప్రొహిబిషన్‌‌ అండ్‌‌ ఎక్సైజ్‌‌ కమిషనర్‌‌ కార్యాలయాల్లో అందజేసేందుకు చాన్స్‌ ఇచ్చారు. రిజిస్టర్‌‌ పోస్టు, మెయిల్‌‌ ద్వారా పంపిస్తే దరఖాస్తులను స్వీకరించరు. దరఖాస్తుదారులకు ఆక్టోబర్​23న డ్రాలో పాల్గొనేందుకు అవసరమైన ఎంట్రీ పాసును అందిస్తారు.  

అమ్మకాలు 10 రెట్లు దాటితే 10 శాతం పన్ను..  

గతంలో మాదిరిగానే 2011  జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు రిటైల్‌‌ షాప్‌‌ ఎక్సైజ్‌‌ ట్యాక్స్‌‌ (ఆర్‌‌ఎస్‌‌ఈటీ) ఖరారు చేశారు.  ఏటా 6 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షలు, 5వేల నుంచి-50వేల మధ్య ఉంటే రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష మధ్య అయితే రూ.60 లక్షలు, లక్ష నుంచి -5లక్షల మధ్య ఉంటే రూ.65 లక్షలు, 5లక్షల నుంచి 20లక్షల జనాభా ఉంటే రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ప్రాంతాల్లో రూ.1.1 కోట్లుగా నిర్ణయించారు. 

మద్యం దుకాణం టర్నోవర్‌‌ వార్షిక లైసెన్స్‌‌ రుసుముకు 10 రెట్లు దాటితే విక్రయాలపై 10 శాతం షాప్‌‌ టర్నోవర్‌‌ ట్యాక్స్‌‌ వసూలు చేస్తారు. స్పెషల్‌‌ రిటైల్‌‌ ఎక్సైజ్‌‌ ట్యాక్స్‌‌ ను ఏటా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. జీహెచ్‌‌ఎంసీకి అవతల 5కిలో మీటర్ల పరిధిలోని దుకాణాలకు జీహెచ్‌‌ఎంసీలోని దుకాణాల లైసెన్స్‌‌ రుసుమే ఉంటుంది. ఇదే నియమం రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లకూ వర్తించనుంది. 

మున్సిపాలిటీ లేదా సెమీ అర్బన్‌‌ ప్రాంతాల్లో ఈ పరిధిని 2కిలోమీటర్లుగా నిర్ణయించారు. రాష్ట్రమంతటా దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, జీహెచ్‌‌ఎంసీలో రాత్రి 11 వరకు అమ్మకాలు జరుపుకోవచ్చు.  రూ.5 లక్షలను అదనంగా చెల్లిస్తే వాక్‌‌-ఇన్‌‌ స్టోర్‌‌ తరహాలో దుకాణాన్ని నిర్వహించవచ్చు.

పెరుగుతున్న దరఖాస్తులు​..  

కొత్త మద్యం పాలసీ ప్రకటించిన ప్రతిసారీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వ ఖజనాకు రాబడి కూడా పెరుగుతోంది. 2023-25 ఎక్సైజ్ పాలసీలో 1,31,490 దరఖాస్తులు రాగా, వాటి ద్వారా రూ.2,629 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఈసారి, దరఖాస్తు రుసుం పెంచడం ద్వారా మరింత ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 2021–23 ఎక్సైజ్​పాలసీలో మొత్తంగా 67,849 అప్లికేషన్లు రాగా, దీని ద్వారా రూ.1,356 కోట్ల ఆదాయం వచ్చింది.