భర్త గొంతు కోసి..అద్దె ఇంట్లో ప్రియుడితో సహజీవనం

భర్త గొంతు కోసి..అద్దె ఇంట్లో ప్రియుడితో సహజీవనం
  • నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్​తో డెడ్​బాడీ కాల్చివేత
  • ఆపై భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
  • అద్దె ఇంట్లో ప్రియుడితో సహజీవనం
  • రంగారెడ్డి జిల్లా  చిన్న చిల్కమర్రి గ్రామంలో ఘటన

షాద్ నగర్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిందో మహిళ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చిన్నచిల్కమర్రి గ్రామంలో జరిగింది. చిన్న చిల్కమర్రి గ్రామానికి చెందిన ఎరుకలి యాదయ్య (32)కు మౌనిక అనే మహిళతో ఎనిమిదేండ్ల క్రితం పెండ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న యాదయ్య..ఇటీవల తాగుడుగు బానిసయ్యాడు.భార్యతో తరచూ గొడవ పడుతున్నాడు. దాంతో ఇంటి అవసరాల కోసం మౌనికపత్తి కంపెనీలో పనికి వెళ్తున్నది. అక్కడే ఆమెకు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ఎరుకలి అశోక్ పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 

మద్యం తాగించి..గొంతు కోసి 

భర్త యాదయ్య కొడుతున్నాడని మౌనిక తన లవర్ అశోక్ కు వివరించింది. తమ సంబంధం కొనసాగాలంటే యాదయ్య అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న సాయంత్రం అశోక్..యాదయ్యను తన బాబాయి ఊరు రామంజపూర్ లో విందు ఉందని వెంట తీసుకువెళ్లాడు. యాదయ్య, మౌనికను ఆటోలో తీసుకెళ్లిన అశోక్.. రాత్రి11 గంటలకు గూడూరు గ్రామం పెద్దగట్టు తండ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆటో ఆపాడు. అక్కడే యాదయ్యకు బాగా మద్యం తాగించారు. యాదయ్య మత్తులో స్పృహ తప్పి పడిపోగానే..అశోక్, మోనిక వేట కొడవలితో అతడి గొంతు కోసి హత్య చేశారు.అంతేకాకుండా.. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను యాదయ్య డెడ్ బాడీపై పోసి కాల్చేశారు. ఆపై ఫిబ్రవరి 19వ తేదీన తన భర్త యాదయ్య కనిపించకుండా పోయాడని మోనిక షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది.

అద్దె ఇంట్లో ప్రియుడితో సహజీవనం

మోనిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో..మౌనిక, అశోక్ తో కలిసి సిటీలోని అయ్యప్ప కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు.. ఈ నెల 23న ఇద్దరిని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు. దాంతో యాదయ్యను తామే చంపినట్లు నిందితులిద్దరు ఒప్పుకున్నారు. ఎక్కడ హత్య చేశారు? శవాన్ని ఎక్కడ పాతిపెట్టారు? వంటి వివరాలను పోలీసులు రాబట్టారు. నిందితులిచ్చిన సమాచారంతో యాదయ్య  శవాన్ని వెలికి తీశారు. డెడ్ బాడీ పూర్తిగా ఎముకల గూడుగా మిగిలిందని ..ఎముకలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆటో, వేట కొడవలిని సీజ్ చేసినట్లు వెల్లడించారు.నిందితులు నేరం ఒప్పుకోవడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.