- వరల్డ్‌స్కిల్స్‌లో మెరిసిన మనోళ్లు.. మెహ్రున్నిసాకు రజతం
- యశ్వంత్ చారికి ‘మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్’
- ప్రపంచ నైపుణ్య పోరులో టాప్-10లో భారత్
- యువత నైపుణ్యానికి పదును పెడితే ప్రపంచాన్ని గెలుస్తారు: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: చైనాలోని షాంఘైలో జరిగిన ‘వరల్డ్‌స్కిల్స్ కాంపిటీషన్-2026’లో తెలంగాణ యువత సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పోటీదారులతో సాగిన ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి ముగ్గురు యువతీయువకులు పాల్గొనగా.. ఇద్దరు ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించారు. ‘లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్’ విభాగంలో మెహ్రున్నిసా రజత పతకం సాధించగా.. ‘క్యాబినెట్ మేకింగ్’ విభాగంలో కె. యశ్వంత్ చారి ‘మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్’ దక్కించుకున్నారు. ఈ విజయాలపై శక్తి శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకురావడం గర్వకారణమన్నారు. గతంలో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో రాష్ట్రానికి కాంస్య పతకం మాత్రమే రాగా.. ఈసారి సిల్వర్ మెడల్‌తో పాటు మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ దక్కడం యువత ప్రతిభకు నిదర్శనమన్నారు.
టాప్-10లో భారత్..
వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో భారత బృందం కూడా సత్తా చాటి టాప్-10లో నిలిచిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 2024లో ఫ్రాన్స్‌లో జరిగిన గత ఎడిషన్‌లో భారత్ 13వ స్థానంలో నిలవగా.. ఈసారి 10వ ర్యాంకుకు చేరిందన్నారు. భారత్ నుంచి 70 మంది పోటీదారులు 63 నైపుణ్య విభాగాల్లో పోటీ పడి 6 సిల్వర్ మెడల్స్, 20 మెడల్ ఫర్ ఎక్సలెన్స్ అవార్డులు సాధించారని వెల్లడించారు. ఆధునిక సాంకేతికత, అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, డిజిటల్, క్రియేటివ్, సర్వీస్ రంగాల్లో భారత యువత అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటున్నారని మంత్రి ప్రశంసించారు. తెలంగాణ యువతలో అపారమైన సృజనాత్మకత, ప్రతిభ ఉందని వివేక్ అన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా అత్యుత్తమ శిక్షణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, గ్లోబల్ అవకాశాలు కల్పిస్తే మున్ముందు మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధిస్తారని అన్నారు. యువత నైపుణ్యానికి పదును పెడితే ప్రపంచాన్ని గెలిచే సత్తా ఉందని పేర్కొన్నారు.
