మోడీ సర్కార్ వర్సెస్ టెలిగ్రామ్.. కేంద్రం నిషేధంపై ఢిల్లీ హైకోర్టుకు టెలిగ్రామ్

మోడీ సర్కార్ వర్సెస్ టెలిగ్రామ్.. కేంద్రం నిషేధంపై ఢిల్లీ హైకోర్టుకు టెలిగ్రామ్

న్యూఢిల్లీ: మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‎పై బ్యాన్ అంశం న్యాయస్థానానికి చేరింది. నీట్ యూజీ రీ-టెస్ట్‌కు ముందు తమ యాప్‎పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ బుధవారం (జూన్ 17) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ యాప్‏పై కేంద్ర  ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా ఆదేశాలు ఇవ్వాలని టెలిగ్రామ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‎ను విచారించనుంది. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో న్యాయస్థానం ఏకీభవిస్తుందా..? లేక టెలిగ్రామ్‎కు ఊరట దక్కుతుందా అనే చూడాలి. 

టెలిగ్రామ్‎పై కేంద్రం తాత్కాలిక నిషేధం

నీట్-యూజీ (NEET-UG) రీ-టెస్ట్ నేపథ్యంలో మెసేజింగ్ ప్లాట్‎ఫామ్ టెలిగ్రామ్‎పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. జూన్ 16 నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు ఇండియాలో టెలిగ్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. 2026, జూన్ 21న నీట్-యూజీ రీ-టెస్ట్ జరగనుంది. నీట్-యూజీ రీ-టెస్ట్‎లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ వంటి అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఎన్టీఏ సిఫార్స్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిషేధం లీకులను ఆపదు: టెలిగ్రామ్

 నీట్-యూజీ రీటెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‎పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడాన్ని ఆ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ తీవ్రంగా విమర్శించారు. ఈ నిర్ణయం అసలు సమస్యను అరికట్టకుండా లక్షలాది సాధారణ వినియోగదారులను ప్రభావితం చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిషేధం పేపర్ లీకులను ఆపలేదని.. కేవలం పేపర్ లీకులు టెలిగ్రామ్ నుంచి ఇతర యాప్‎లకు తరలిపోతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

►ALSO READ | ‘‘అసలు వీడు మనిషేనా..? పసికందును గాల్లోకి విసిరేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.. ఇదేం శాడిజం? ’’

“కొందరు వినియోగదారులు లీకైన పరీక్ష ప్రశ్నలను షేర్ చేశారన్న కారణంతో భారత ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‎ను ఒక వారం పాటు నిషేధించింది. ఇది భారతదేశంలోని 15 కోట్లకు పైగా సాధారణ టెలిగ్రామ్ వినియోగదారులను శిక్షిస్తుంది. అంతేగానీ పేపర్ లీక్ చేసిన వ్యక్తులను కాదు. ఈ నిషేధం దేన్నీ ఆపలేదు. భారత ప్రభుత్వ నిర్ణయంతో లీకులు టెలిగ్రామ్ నుంచి ఇతర యాప్లకు తరలిపోతాయి” అని పావెల్ దురోవ్ పేర్కొన్నారు.