ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు సెల్‌‌‌‌ఫోన్లో గుట్టు! కీలకంగా మారిన కాల్ డేటా, వాట్సాప్, ఫేస్‌‌‌‌టైమ్ చాట్‌‌‌‌లు

ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు సెల్‌‌‌‌ఫోన్లో గుట్టు! కీలకంగా మారిన కాల్ డేటా, వాట్సాప్, ఫేస్‌‌‌‌టైమ్ చాట్‌‌‌‌లు
  • సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ను సీజ్‌‌‌‌ చేసి ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌కు పంపిన సిట్
  • 2023 అక్టోబర్ నుంచి మార్చి 15 వరకు కాల్ డేటాలో గుట్టు
  • పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలతో సంప్రదింపులు
  • నిందితులు, బాధితుల స్టేట్‌‌‌‌మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావు విచారణ
  • రేపు మరోసారి సిట్‌‌‌‌ విచారణకు ప్రభాకర్ రావు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసు ప్రస్తుతం ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు ఫోన్ల చుట్టూ తిరుగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో ఓఎస్డీగా పనిచేసిన నాటి నుంచి ఆయన వినియోగించిన సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ను సిట్‌‌‌‌ సీజ్‌‌‌‌ చేసింది. మరో సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ కూడా అప్పగించాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సిట్‌‌‌‌ అధికారుల ముందు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదుసార్లు ఆయన స్టేట్‌‌‌‌మెంటును రికార్డు చేసిన సిట్‌‌‌‌ అధికారులు.. సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ సీజ్‌‌‌‌ చేశారు. డేటా రిట్రీవ్‌‌‌‌ కోసం ఫోరెన్సిక్ సైన్స్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌)కు పంపించారు. దర్యాప్తులో భాగంగా దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నికలు సహా 2023 అక్టోబర్ నుంచి గతేడాది మార్చి 15 వరకు ప్రభాకర్‌‌‌‌ రావు మొబైల్‌‌‌‌ కాల్ డేటాను ఇప్పటికే సేకరించారు. వీటి ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా ప్రణీత్‌‌‌‌రావు సహా నిందితుల కాల్స్‌‌‌‌, ఆపరేషన్లకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్‌‌‌‌లతో ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ప్రభాకర్‌‌‌‌ రావును మరోసారి విచారించనున్నారు.

వాట్సాప్, ఫేస్‌‌‌‌టైమ్ కాల్స్‌‌‌‌.. ఫోన్లు ఫార్మాట్‌‌‌‌
ఈ కేసులో నిందితులైన ఎస్‌‌‌‌ఐబీ, ఎస్‌‌‌‌ఓటీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రణీత్‌‌‌‌రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌‌‌రావు గుట్టును సిట్‌‌‌‌ అధికారులు సెల్‌‌‌‌ఫోన్ డేటాతోనే విప్పారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు, ప్రణీత్‌‌‌‌ రావు సెల్‌‌‌‌ఫోన్లు, కాల్స్‌‌‌‌ డేటా, వాట్సాప్ చాట్‌‌‌‌లను రిట్రీవ్‌‌‌‌ చేస్తున్నది. అయితే ప్రభాకర్ రావు అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు గుర్తించింది. 

ఫోన్లలో సాధారణ కాల్స్‌‌‌‌ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ సహా ఇతర రహస్యాలను వాట్సాప్ కాలింగ్‌‌‌‌, ఫేస్‌‌‌‌టైమ్ సహా ఇతర యాప్స్‌‌‌‌ ద్వారా మాట్లాడేవారని, కొన్ని ఫోన్లను ధ్వంసం చేసినట్లు అనుమానిస్తున్నది. ఈ మేరకు ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వెనుక ఉన్న పెద్దల గుట్టు విప్పేందుకు అప్పట్లో ప్రభాకర్ రావు వినియోగించిన ఫోన్లను రిట్రీవ్‌‌‌‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే ఆరో నిందితుడైన శ్రవణ్‌‌‌‌రావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన రెండు సెల్‌‌‌‌ఫోన్లను సీజ్‌‌‌‌ చేసి.. ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ ఆధారంగా పలుమార్లు ప్రశ్నించారు.

అనుమానిత నేతలు కూడా ఫోన్లు మార్చారు!
ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులు సహా ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌లో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు కూడా తాము వినియోగించిన ఫోన్లను మాయం చేశారని, ధ్వంసం చేశారని సిట్‌‌‌‌ అనుమానిస్తున్నది. ట్యాపింగ్ సమయంలో వీరంతా వినియోగించిన ఫోన్లకు సంబంధించిన ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఆయా సెల్‌‌‌‌ఫోన్లను సిట్‌‌‌‌ స్వాధీనం చేసుకుంటున్నది.

ఫార్మాట్‌‌‌‌ చేసిన ఫోన్లతో పాటు పగులగొట్టిన సెల్‌‌‌‌ఫోన్ల నుంచి పూర్తి డేటా రిట్రీవ్ చేస్తోంది. ఇందులో ప్రభాకర్ రావు సహా ప్రముఖ నేతలు వాట్సాప్ కాలింగ్‌‌‌‌, చాట్‌‌‌‌లు, ఫేస్‌‌‌‌టైమ్ లాంటి యాప్స్‌‌‌‌ ద్వారా మాట్లాడుకునే వారని ఇప్పటికే నిందితుల ద్వారా సమాచారం సేకరించింది. ప్రభాకర్ రావు ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ ఆధారంగా ఆయా వ్యక్తులను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు సర్వీస్ ప్రొవైడర్లు అందించిన లిస్ట్‌‌‌‌లో 618 ఫోన్ నంబర్లు ఉంటే ధ్వంసమైన ఎస్‌‌‌‌ఐబీ హార్డ్‌‌‌‌ డిస్కుల్లో ఇంకెన్ని రహస్యాలు ఉన్నాయనే కోణంలో సిట్‌‌‌‌ దర్యాప్తు చేస్తున్నది. ఈ మేరకు నిందితులైన మాజీ పోలీస్ అధికారుల నుంచే ఆయా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నది.

పోలీస్ ఉన్నతాధికారులు, ప్రముఖ నేతలతో సంప్రదింపులు
ప్రభాకర్ రావు కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే కీలక సమాచారం సేకరించారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ప్రతికూలంగా కాంగ్రెస్‌‌‌‌కు అనుకూలంగా ఫలితాలు రావడంతో ప్రభాకర్ రావు అప్రమత్తమైనట్లు సిట్‌‌‌‌ గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫిబ్రవరిలో ఎస్‌‌‌‌ఐబీకి వచ్చిన సర్వీస్ ప్రొవైడర్ల డేటాలో 618 మంది పొలిటికల్ లీడర్లు వారి అనుచరులు, ప్రముఖ వ్యాపారవేత్తల ఫోన్‌‌‌‌ నంబర్లు ఉన్నట్లు బయటపడింది. 

దీంతో ఇందుకు సంబంధించిన విషయాలను గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు, పోలీస్‌‌‌‌ ఉన్నతాధికారులతో ప్రభాకర్‌‌‌‌ రావు మాట్లాడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తన అరెస్ట్‌‌‌‌ తప్పదని గుర్తించి చెన్నై మీదుగా అమెరికాకు పారిపోయినట్లు ఇప్పటికే సిట్‌‌‌‌ ఆధారాలు సేకరించింది. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పీఎస్‌‌‌‌లో కేసు నమోదైన తరువాత కూడా రాష్ట్రంలోని పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, తన సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రముఖ నేతతో నిరంతరం మాట్లాడేవాడని కాల్ డేటా ఆధారంగా సిట్‌‌‌‌ గుర్తించింది.