మహా ఎన్నికల మోసంపై మెసేజ్లకు ట్రాయ్ నిరాకరణ

మహా ఎన్నికల మోసంపై మెసేజ్లకు ట్రాయ్ నిరాకరణ
  • ‘ప్రొటెస్ట్​ కంటెంట్‌’ అంటూ అనుమతివ్వలే: కాంగ్రెస్​
  • హోంశాఖ, ఈసీ, ట్రాయ్‌ మధ్య ఇంత సమన్వయం ఎలా సాధ్యమైంది?
  • ఓట్ల చోరీకి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అని  ప్రశ్న

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన మోసాన్ని తమ కార్యకర్తలకు తెలియజేసేందుకు ఎస్ఎంఎస్​పంపుకునేందుకు కూడా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్) అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్​ పార్టీ ఆరోపించింది. ‘ప్రొటెస్ట్​ కంటెంట్’ పేరుతో తమ విజ్ఞప్తిని తిరస్కరించిందని మండిపడింది. ఇది సమాచారాన్ని అణచివేయడానికి ప్రభుత్వ విభాగాలన్నీ ఎలా సమన్వయంతో పనిచేశాయో తెలియజేస్తున్నదని పేర్కొన్నది. ఈమేరకు కాంగ్రెస్​ పార్టీ డేటా ఎనలిటిక్స్​ విభాగం చైర్మన్​ ప్రవీణ్​ చక్రవర్తి ‘ఎక్స్’లో పోస్ట్​ పెట్టారు. 

‘మహారాష్ట్ర 2024 ఎన్నికలు ఎలా చోరీ చేశారు’ అనే యూట్యూబ్ డాక్యుమెంటరీ లింక్‌ను తమ మహారాష్ట్ర కేడర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపేందుకు ప్రభుత్వ ప్రక్రియ ప్రకారం ట్రాయ్‌కి దరఖాస్తు చేశామని, అయితే   దానిని ‘నిరసన కంటెంట్’  అని పేర్కొంటూ ట్రాయ్​ తిరస్కరించిందని తెలిపారు. ‘‘కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘం, టెలికం రెగ్యులేటర్ మధ్య ఇంత సంపూర్ణ సమన్వయం ఎలా సాధ్యం? మహారాష్ట్ర ఎన్నికల్లో మోసం గురించి ఇంతకంటే స్పష్టమైన సంకేతాలు ఏమైనా అవసరమా?” అని వ్యాఖ్యానించారు. ‘ప్రొటెస్ట్​ కంటెంట్’​ అంటూ ట్రాయ్‌ పంపిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. 

విడ్డూరంగా ఉంది: మాణిక్కం ఠాగూర్

చక్రవర్తి పోస్ట్‌ను కాంగ్రెస్​ లోక్​సభ కాంగ్రెస్ విప్​ మాణిక్కం ఠాగూర్​ ట్యాగ్​ చేశారు. ‘‘ఇది విడ్డూరంగా ఉంది. ఈ లింక్‌తో కాంగ్రెస్ ఒక సాధారణ ఎస్ఎంస్ పంపడానికి ప్రయత్నించినప్పుడు ట్రాయ్​ అనుమతిని తిరస్కరించింది. దానిని ‘నిరసన కంటెంట్’ అని పేర్కొంది. ఈ సెన్సార్‌షిప్ చైన్‌ను ఎవరు నియంత్రిస్తున్నారు?  అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్, జ్ఞానేశ్వర్ (కుమార్)” అని ప్రశ్నించారు. 

ట్రాయ్‌ ఎప్పటి నుంచి బీజేపీ ఐటీ సెల్‌గా మారిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ప్రశ్నించారు. ‘‘మీరు ఎంత ఎక్కువ సెన్సార్ చేస్తే..  ప్రజలు అంత బిగ్గరగా ప్రశ్నిస్తారని అన్నారు. మహారాష్ట్ర 2024 ఎన్నికల గురించి కచ్చితంగా 
ఏదో దాచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు.