పల్నాడు ఎస్పీ ఆఫీసు దగ్గర హైడ్రామా... ఏడు గంటల పాటు ఆఫీసులోనే బైఠాయించిన ఎమ్మెల్యే 

పల్నాడు ఎస్పీ ఆఫీసు దగ్గర హైడ్రామా... ఏడు గంటల పాటు ఆఫీసులోనే బైఠాయించిన ఎమ్మెల్యే 

పల్నాడు జిల్లాలో ఎస్పీ కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాను సిఫారసు చేసిన వ్యక్తిని లీగల్ అడ్వైజర్ గా నియమించాలంటూ ఎనిమిది నెలల క్రితం ఎస్పీకి సూచించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఇందుకు సంబంధించి సిఫారసు లేఖ కూడా ఎనిమిది నెలల క్రితమే పంపినట్లు తెలుస్తోంది. ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా లీగల్ అడ్వైజర్ నియామకం చేపట్టకపోవడంతో ఎస్పీతో  చర్చించేందుకు మంగళవారం ( మార్చి 31 ) ఎస్పీ ఆఫీసులో ధర్నాకు దిగారు ఎమ్మెల్యే.

ఎనిమిది నెలల నుంచి తనను ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. లాయర్లతో కలిసి వెళ్లిన సుమారు ఏడు గంటల పాటు ఎస్పీ ఆఫీసులోనే బైఠాయించిన ఎమ్మెల్యే అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాను రెకమెండ్ చేసిన వ్యక్తికీ అన్ని అర్హతలు ఉన్నాయని..అతనిని వెంటనే నియమించాలని కోరారు ఎమ్మెల్యే అరవింద్ బాబు.

అయితే.. లీగల్ అడ్వైజర్ నియామకం పరిశీలనలో ఉందని తెలిపారు ఎస్పీ కృష్ణారావు. ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపే ముందు అభ్యర్థి అర్హతను రివ్యూ చేస్తామని ఎమ్మెల్యేకు ఎస్పీ చెప్పినట్లు సమాచారం. డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే తుది నియామకం జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ క్రమంలో లీగల్ అడ్వైజరీ నియామకంపై జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఐదు నెలలుగా నియామకం పెండింగ్ లో ఉందని.. అయినా పోలీస్ ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని అన్నారు ఎమ్మెల్యే. ఈ క్రమంలో ఎస్పీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులో ఉండగానే తన క్యాంపు ఆఫీసుకు వెళ్లారు ఎస్పీ కృష్ణారావు. ఎస్పీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే.

లీగల్ అడ్వైజర్ నియామకంపై అధికారిక ప్రకటన వచ్చేవరకు తాను కదలబోనని పట్టుబట్టి ఎస్పీ ఆఫీసులోనే బైఠాయించారు ఎమ్మెల్యే. ఎస్పీ ఆఫీసులోని ఓ గదిలోనే ధర్నాకు దిగారు ఎమ్మెల్యే అరవింద్ బాబు.