కేదార్‌‌‌‌నాథ్ భక్తులకు తెలుగింటి భోజనం

కేదార్‌‌‌‌నాథ్ భక్తులకు తెలుగింటి భోజనం

తీర్థ యాత్రల్లో ఛార్‌‌‌‌ధామ్ యాత్రకు ఎంతో  ప్రత్యేకత ఉంటుంది. వాటిలో కేదార్‌‌‌‌నాథ్ యాత్రకు వెళ్లడం చాలా కష్టం. ఈ మహాయాత్ర కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. కొండలు, లోయల్లో సాగే ఈ యాత్రకు వెళ్లేవాళ్ల ఆకలిదప్పులు తీరుస్తోంది సిద్దిపేటలోని కేదార్‌‌‌‌నాథ్ అన్నదాన సేవా సమితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు ఉచితంగా టీ, టిఫిన్‌‌, భోజనం అందిస్తోంది. 

ఎక్కడి సిద్దిపేట.. ఎక్కడి కేదార్​నాథ్​.. దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరం. అయితేనేం సేవ చేయడానికి ఎంతదూరమైనా వెళ్తామంటున్నారు సిద్దిపేటవాసులు. ఉత్తరాఖండ్‌‌లో కొలువైన కేదారీశ్వరుడ్ని దర్శించుకునేందుకు ఏడాదిలో 45 రోజులు మాత్రమే అనుమతి ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షలాది మంది కేదార్‌‌‌‌నాథ్‌‌ ఆలయాన్ని  దర్శించుకుంటారు. ఈ యాత్రకు వెళ్లే భక్తుల ఆకలి తీర్చేందుకు సిద్దిపేటకు చెందిన  ‘కేదార్‌‌‌‌నాథ్ అన్నదాన  సేవా సమితి’ ఉచితంగా ఆహారం అందిస్తోంది. కరోనా వల్ల పోయిన ఏడాది అన్నదానం చేయలేదు. ఈ ఏడు కేదార్‌‌‌‌నాథ్ యాత్ర మొదలయ్యే సోన్‌‌ ప్రయాగ ప్రాంతంలో లంగర్‌‌‌‌ (క్యాంప్‌‌) ఏర్పాటు చేసి, జలందర్ కేదార్‌‌‌‌నాథ్ లంగర్ కమిటీతో కలిసి అన్నదానం చేస్తున్నారు. ఈ నెల 4న మొదలైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు దాదాపు 50 వేల మందికి టీ, కాఫీ, టిఫిన్స్‌‌, భోజనాలు పెట్టారు. యాత్ర ముగిసే వరకు(జూన్ 15) యాత్రికులకు ఆహారం అందిస్తుంటారు. 

అనుభవం నుంచి... 

సిద్దిపేటకు చెందిన కొంత మంది భక్తులు 2018 లో కేదార్‌‌‌‌నాథ్ యాత్రకు వెళ్లారు. అప్పుడు అక్కడ ఫుడ్‌‌ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి ఇబ్బంది అక్కడికి వెళ్లేవాళ్లకు రాకూడదని కేదార్‌‌‌‌నాథ్ యాత్రికులకు ఆహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2019లో 30 మంది సభ్యులతో ‘కేదార్‌‌‌‌నాథ్ అన్నదాన సేవా సమితి’ని ఏర్పాటు చేశారు. ఈ ఏడు మరో 20 మంది సభ్యులు చేరారు. మొదటిసారి దాదాపు 50 వేల పై చిలుకు యాత్రికులకు భోజనం పెట్టారు. ఈసారి రోజుకు మూడు వేల మందికి పైగా భక్తులకు ఫుడ్‌‌ పెడుతున్నారు. అంతేకాదు.. భక్తులకు యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. కొందరికి లంగర్‌‌‌‌లో బస చేసే అవకాశం కూడా ఇస్తున్నారు. 

50 లక్షలు ఖర్చు

కేదార్‌‌‌‌నాథ్ భక్తుల ఫుడ్‌‌ కోసం అన్నదాన సేవా సమితి సభ్యులు దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏప్రిల్ 27న సిద్దిపేట నుంచి 30 లక్షల విలువైన సరుకులు, వంటవాళ్లతోపాటు 15 మంది సేవా సమితి సభ్యులు సోన్ ప్రయాగకు వెళ్లారు. సోన్ ప్రయాగ నుంచి 600 కిలో మీటర్ల దూరంలోని జలందర్ నుంచి మరో 20 లక్షల రూపాయల విలువైన వంట సామాన్లు తెప్పించారు. 

తెలుగు రుచుల విందు

 కేదార్‌‌‌‌నాథ్ యాత్రికులకు లంగర్‌‌‌‌లో పసందైన తెలుగు రుచులను రుచి చూపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీ, కాఫీ , టిఫిన్స్‌‌, భోజనం పెడుతున్నారు. టిఫిన్స్‌‌లో ఇడ్లి, వడ, పొంగల్‌‌... భోజనంలో ఆరు రకాల వంటకాలు స్వీట్స్, పాపడ్, చపాతీలు పెడుతున్నారు. వీటి కోసం ప్రతి రోజు ఆరుగురు వంటవాళ్లు  పనిచేస్తున్నారు.

సేవా భావంతోనే.. 

కేదార్‌‌‌‌నాథ్ యాత్రకు వచ్చే భక్తులు ఆహారం కోసం ఇబ్బంది పడొద్దనే లంగర్‌‌‌‌ ఏర్పాటు చేశాం. 45 రోజుల పాటు ఫుడ్‌‌ పెట్టడంతోపాటు యాత్రికులకు ఉచిత బస సౌకర్యం కల్పిస్తున్నాం. కేదారీశ్వరుడి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం ఈశ్వర కటాక్షంగా భావిస్తున్నాం. 
::: చీకోటి మధుసూధన్, కేదార్‌‌‌‌నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు


::: హెచ్.రఘునందన్ స్వామి, సిద్దిపేట, వెలుగు