
మెహిదీపట్నం, వెలుగు: విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని, బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని తెలుగు సంక్షేమ భవనాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు రూ.6 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు.
వంద బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలని, బీసీ గురుకులాల్లో 20 శాతం సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు అద్దె చెల్లించలేకపోతున్నాయని, పిల్లలు పైచదువులకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మెహిదీపట్నంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో నీలం వెంకటేశ్, జిల్లపల్లి అంజి, సతీశ్, మోడీ రాందేవ్, అనంతయ్య, రాజేందర్ పాల్గొన్నారు.