అబిడ్స్, వెలుగు: తెలుగు విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ నాంపల్లిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆద్యకళ పేరుతో మాజీ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు ఆధీనంలో ఉన్న భవనాలు, గదులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పాత సామగ్రిని తొలగించాలని కోరారు. విశ్వవిద్యాలయ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
విశ్వవిద్యాలయం కోసం బాచుపల్లిలో కొత్త భవనం నిర్మించామని చెబుతున్నప్పటికీ, అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని, నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీలో జ్యోతిష్యం, యోగా, బి.డిజైన్, పద్యనాటకం, దూరవిద్యతో పాటు పలు కోర్సుల్లో 2,500 మందికి పైగా చదువుతున్నారని తెలిపారు. నాంపల్లి క్యాంపస్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీక్ష లో సుజాత దీక్షిత్, జనార్దన్, అందే భాస్కర్, గోపాల్, శివాజీ , ఆదిత్య, సత్యనారాయణ , డా.రాంబాబు, జయశ్రీ , వాసుమతి వరకాల పాల్గొన్నారు.
