రాష్ట్రంలో టెంపరేచర్లు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం

రాష్ట్రంలో టెంపరేచర్లు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. టెంపరేచర్లు 40 డిగ్రీలపైనే నమోదవుతాయని వెల్లడించింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండ వేడి తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న చెప్పారు. ఖమ్మం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు, వాటి సరిహద్దు ప్రాంతాల్లో టెంపరేచర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల నమోదవుతుందని చెప్పారు. మరోవైపు, రాష్ట్రంలో పలుచోట్ల శనివారం 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. అలంపూర్‌‌‌‌లో 40.8 డిగ్రీలు, నిర్మల్‌‌ జిల్లా దస్తూరాబాద్‌‌లో 40.7, కేతేపల్లి (వనపర్తి జిల్లా)లో 40.5, ఆదిలాబాద్ అర్బన్, కట్టంగూర్‌‌‌‌లలో 40.4, కల్వకుర్తి, ఘనపూర్ (నల్గొండ జిల్లా)లో 40.2, కాపుల కానపర్తిలో 40 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఆదివారం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌‌ను జారీ చేసింది. 

మూడు నెలలు మంటే..

ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. సౌత్‌‌, నార్త్ వెస్ట్ ఇండియాలోని కొన్ని ప్రాంతాలు మినహా టెంపరేచర్లు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే చాన్స్‌‌ ఉందని తెలిపింది. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇటు రాత్రి టెంపరేచర్లూ పెరుగుతాయని, సాధారణం కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతాయని పేర్కొంది. మరోవైపు పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో ఎల్‌‌నినో పరిస్థితులు నార్మల్‌‌గానే ఉన్నాయని, వేసవి మొత్తం అలాగే ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.