ఢిల్లీలో 49.2 డిగ్రీల ఎండ

ఢిల్లీలో 49.2 డిగ్రీల ఎండ

24 గంటల్లో అండమాన్​కు నైరుతి

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ముంగేశ్ పూర్ ప్రాంతంలో ఆదివారం అత్యధికంగా 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నజఫ్ గఢ్ అబ్జర్వేటరీ ఏరియాలో 49.1 డిగ్రీలు నమోదైంది. సబ్దార్​జంగ్​తో సహా ఇతర ప్రాంతాల్లో 47 డిగ్రీల టెంపరేచర్  నమోదైంది. ఇంకో రెండుమూడు రోజులు వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ ​దీవులు, బెంగాల్​ తీర ప్రాంతాలను తాకనున్నట్లు తెలిపారు.

ఇయ్యాల, రేపు మోస్తరు వానలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లాలోని రాంపూర్‌‌లో 5.6 సెంటీమీటర్లు, రంగారెడ్డిలోని ప్రొద్దుటూరులో 5.4, రాజన్నసిరిసిల్లలోని గాజాసింగారంలో 4.4, వికారాబాద్‌‌లోని ధరూర్‌‌లో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. మరో వైపు ఎండలు కూడా దంచి కొడ్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌‌లోని జైనద్‌‌లో 45.2 డిగ్రీలు, నిర్మల్‌‌లోని చాప్రాలలో 44.9, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌లో 44.8, పెద్దపల్లిలోని ఏశాల తక్కెళ్లపల్లిలో 44.3 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.