- నామినేషన్ల విత్‌డ్రాలో టెన్షన్
- చివరి గంటలో బీఫామ్స్అందజేత
- టికెట్ రాని అభ్యర్థులు ఇడిపెండెంట్ గా బరిలో..
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: మున్సిపల్‌ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉత్కంఠ మధ్య మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు ఖరారయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా హైడ్రామా నడిచింది. ఆయా పార్టీలు కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న క్యాండిడేట్లను ముందుగానే కన్ఫామ్ చేసినప్పటికీ బీఫామ్స్ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొన్నది. నామినేషన్ల విత్‌డ్రాకు మధ్యాహ్నం 3 గంటలకు వరకు గడువు ఉండగా, చివరి నిమిషం వరకూ టెన్షన్ వాతావరణం కనిపించింది.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు కాంగ్రెస్ అభ్యర్థులను నాలుగు రోజుల కిందటే ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేయకపోవడంతో బీఫామ్స్ పెండింగ్ పెట్టాయి. ఆ రెండు పార్టీలు కూడా ఇదే ఫాలో అయ్యాయి.
ముందుగానే క్యాండిడేట్లను ప్రకటిస్తే టికెట్‌దక్కని వారు కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని లిస్టును సీక్రెట్‌గా ఉంచాయి. మధ్యాహ్నం వరకూ రెబల్స్‌తో మంతనాలు జరిపి, బుజ్జగించి, బెదిరించి నామినేషన్లు విత్‌డ్రా చేయించడంలో సక్సెస్ అయ్యారు. చివరి గంటలో ఆయా పార్టీలు బీఫామ్స్ అందజేసి ఉత్కంఠకు తెరదించాయి.
క్యాంప్ ఆఫీస్ వద్ద లొల్లి
బెల్లంపల్లి లో కాంగ్రెస్ టికెట్ల కోసం ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర మధ్యాహ్నం వరకు లొల్లి కొనసాగింది. చివరకు పార్టీ లీడర్ల ద్వారా ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ బీఫామ్స్ అందజేశారు. క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి బుజ్జగింపులు ఫలించాయి. టికెట్లు రానివారికి కో ఆప్షన్, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇవ్వడంతో రెబల్స్ పోటీ నుంచి తప్పుకున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్కు కరువైన అభ్యర్థులు
మంచిర్యాల కార్పొరేషన్ 53వ డివిజన్బీజేపీ అభ్యర్థి బోయిని లలిత బీసీ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. 54వ డివిజన్ బీజేపీ అభ్యర్థి, 10వ డివిజన్ బీఆర్ఎస్అభ్యర్థి నామినేషన్లు విత్‌డ్రా చేసుకొని పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో రెండు చోట్ల బీజేపీకి, ఒక డివిజన్లో బీఆర్ఎస్కు క్యాండిడేట్లు కరువయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ వలలో పడకుండా కాపాడుకోవడానికి ఆ రెండు పార్టీలు నానా పాట్లు పడ్డాయి. పార్టీల నుంచి టికెట్ వస్తుందనే ఆశతో కొంత మంది నామినేషన్ వేసినప్పటికీ టికెట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగ పడ్డ అభ్యర్థులు తాము ఎన్నికల బరిలో ఉంటామని స్పష్టం చేశారు.
బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు 615 నామినేషన్లు రాగా, వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు 240 మంది పోటీలో ఉన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు 173 మంది, క్యాతనపల్లిలో 22 వార్డులకు 113 మంది, చెన్నూర్‌లో 18 వార్డులకు 107 మంది, లక్సెట్టిపేటలో 15 వార్డులకు 60 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆసిఫాబాద్‌లో 20 వార్డులకు 94 మంది, కాగజ్‌నగర్‌లో 30 వార్డులకు 130 మంది, నిర్మల్‌లో 42 వార్డులకు 182 మంది, ఖానాపూర్‌లో 12 వార్డులకు 56 మంది, భైంసాలో 115 మంది బరిలో ఉన్నారు.
మున్సిపాలిటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతర ఇండి మొత్తం
మంచిర్యాల (కార్పొ) 59 58 58 46 19 240
బెల్లంపల్లి 34 34 20 18 66 173
క్యాతనపల్లి 22 22 15 19 35 113
చెన్నూర్ 18 18 18 15 38 107
లక్సెట్టిపేట 15 14 14 06 11 60
ఆసిఫాబాద్ 19 20 18 15 22 94
కాగజ్ నగర్ 29 30 30 18 23 130
నిర్మల్ 42 36 42 35 27 182
భైంసా 24 15 12 18 46 115
ఖానాపూర్ 12 12 12 14 16 56
