- ఇరు వర్గాల మధ్య తోపులాట
- హింసకు దారితీసిన ర్యాలీ
- పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలు
- పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలు
- 14 మంది స్టూడెంట్ లీడర్ల అరెస్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) క్యాంపస్‌లో విద్యార్థుల నిరసన ప్రదర్శన మళ్లీ ఉద్రిక్తంగా మారింది. గురువారం అర్ధరాత్రి విద్యా శాఖ ఆఫీసు ముట్టడికి వెళ్తున్న స్టూడెంట్లను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి క్రమంగా హింసకు దారితీసింది. దీంతో జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అదితి మిశ్రా, మాజీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ సహా మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రెగ్యులేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యా శాఖ ఆఫీసు ముట్టడికి విద్యార్థులు బయలుదేరారు. అయితే, అనుమతి ఇవ్వకున్నా స్టూడెంట్లు ర్యాలీ తీశారని వర్సిటీ అధికారులు ఆరోపించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటలకు క్యాంపస్ నుంచి స్టూడెంట్లు బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్యాంపస్ ఆవరణలో పెట్టిన బారికేడ్లను స్టూడెంట్లు డ్యామేజ్ చేశారని, పోలీసులపై దాడులకు దిగారని పోలీసులు ఆరోపించారు. దీంతో 25 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు.
పోలీసులే ముందు దాడికి పాల్పడ్డారు
పోలీసులే ముందు తమపై దాడి చేశారని స్టూడెంట్లు ఆరోపించారు. వారి అత్యుత్సాహంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారని చెప్పారు. 50 మంది స్టూడెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని తెలిపారు. అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా లాక్కున్నారని పేర్కొన్నారు. కాగా.. పోలీసులపై దాడి, విధులను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడడంతో విద్యార్థులపై పలు సెక్షన్ల కింద వసంత్‌కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
