V6 News

సీఎం ఇంటి ముట్టడికి బీజేపీ యత్నం

సీఎం ఇంటి ముట్టడికి బీజేపీ యత్నం
  •     జూబ్లీహిల్స్‌‌‌‌లో ఉద్రిక్తత
  •     పోలీసులతో నేతల వాగ్వాదం.. తోపులాట
  •     మహిళా మోర్చా, బీజేవైఎం నేతల అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లు వీగిపోయేలా కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యవహరించాయని నిరసిస్తూ బీజేపీ శనివారం చేపట్టిన ముఖ్యమంత్రి నివాస ముట్టడికి యత్నించింది. మహిళా మోర్చా, బీజేవైఎం నాయకులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్  జూబ్లీహిల్స్‌‌‌‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయగా.. పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

రాంచందర్ రావు గృహ నిర్బంధం

మరోవైపు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలోనే హౌజ్  అరెస్ట్  చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... మహిళా రిజర్వేషన్  బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్  డీఎన్ఏలోనే ఉందన్నారు. బ్రిటిష్  వారు స్థాపించిన కాంగ్రెస్  పార్టీకి  ఇటాలియన్  అధినేతగా ఉన్నారని, ఆ కుటుంబానికి కాంగ్రెస్  నేతలు బానిసలుగా పనిచేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబంలోని మహిళలు తప్ప సామాన్య మహిళలు రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్  నేతలకు ఇష్టం లేదని విమర్శించారు. 

2023లో బిల్లుకు మద్దతు తెలిపి, ఇప్పుడు మాట మార్చడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే తమ కుటుంబ సభ్యులకు సీట్లు రావని, ముస్లిం రిజర్వేషన్లు పోతాయనే భయంతోనే బిల్లును కాంగ్రెస్  వ్యతిరేకించిందని  ఆరోపించారు. ఉత్తరాది, దక్షిణాది ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఆ పార్టీ  వ్యవహరిస్తోందన్నారు.