- స్టూడెంట్లను డిటైన్ చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం
- క్యాంపస్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం
- ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
జీడిమెట్ల, వెలుగు : మేడ్చల్మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాజమాన్యం 40 మంది స్టూడెంట్లను డిటైన్ చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వర్సిటీకి చేరుకుని అగ్రికల్చరల్బ్లాక్– ఏ ముందు ఆందోళనకు దిగారు. ఫర్నిచర్ధ్వంసం చేసి, ఎమ్మెల్యే మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్టూడెంట్లు, తల్లిదండ్రులను సముదాయించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటోందని స్టూడెంట్లు ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తుండడాన్ని నిరసిస్తూ తాము ఫీజులు కట్టకపోవడంతో 22 మందిని డిటైన్చేసిందని చెప్పారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని గొంతెత్తితే డిటైన్చేశారని వాపోయారు. నిబంధనల ప్రకారం కాలేజీ నడవడం లేదని, ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేవలం లాభాపేక్షతోనే యూనివర్సీటీ నడుపుతున్నారని మండిపడ్డారు. ఎవరైనా సమస్యలపై మాట్లాడితే డిటైన్చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్టూడెంట్ల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మద్దతు తెలిపారు. స్టూడెంట్లకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అధిక ఫీజుల కోసం ఇబ్బంది పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చివరకు స్టూడెంట్లకు న్యాయం చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
రాజకీయ ఎజెండాతోనే ఆందోళన : ప్రీతిరెడ్డి
యూనివర్సీటీలో జరిగిన ఆందోళనపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి స్పందించారు. ‘‘స్టూడెంట్లు, తల్లిదండ్రులకు ఏదైనా సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది కేవలం స్టూడెంట్లు, మేనేజ్మెంట్కి సంబంధించిన విషయం. ఆందోళన వెనుక రాజకీయ ఎజెండా ఉంది. స్టూడెంట్లపై యాజమాన్యానికి వ్యక్తిగత కక్షలు ఏమీ ఉండవు. నిబంధనల ప్రకారమే డిటైన్చేశాం. అంత మాత్రాన ధర్నా చేయడం ఏమిటి. వర్సిటీలో క్వాలిఫికేషన్ లేని లెక్చరర్లు ఉన్నారనడంలో నిజం లేదు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేయొచ్చు కదా? యూనివర్సిటీ ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఎంత వరకు సమంజసం. స్టూడెంట్లకు ఎలాంటి అన్యాయం చేయలేదు.” అని పేర్కొన్నారు.
