మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా.. పోలీసులతో సురేఖ కూతురు సుస్మిత వాగ్వాదం

మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా.. పోలీసులతో సురేఖ కూతురు సుస్మిత వాగ్వాదం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం రాత్రి హైడ్రామా జరిగింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌‌‌‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఆమె కూతురు సుస్మిత అడ్డుకున్నారు. సుమంత్ ను ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తప్పించిన నేపథ్యంలో బుధవారం రాత్రి11 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌‌‌‌లోని కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చారు. సుమంత్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేసేందుకు వచ్చామని పోలీసులు తెలుపడంతో సురేఖ కూతురు సుస్మిత వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చిన సమయంలో కొండా సురేఖ, సుమంత్‌‌‌‌ ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే సుస్మిత పోలీసులను వారెంట్‌‌‌‌ చూపాలని నిలదీశారు. 

ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కారణాలు చూపాలని డిమాండ్‌‌‌‌ చేశారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. తమకు సహకరించాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇదంతా జరుగుతుండగానే కొండా సురేఖతో కలిసి ఆమె కారులోనే సుమంత్‌‌‌‌ కూడా బయటకు వెళ్లిపోయాడు. అయితే, ఓఎస్డీగా సుమంత్‌‌‌‌ను తొలగించిన తరువాత వరుసగా జరుగుతున్న ఘటనలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి హనుమకొండకు వెళ్లిన సమయంలో కొండా సురేఖ హైదరాబాద్‌‌‌‌కు వచ్చారు. సీఎం ప్రొగ్రామ్‌‌‌‌లో కూడా ఆమె పాల్గొనలేదు. 

బీసీలను అణచివేస్తున్నారు: కొండా సురేఖ కూతురు సుస్మిత 

దక్కన్‌‌‌‌ సిమెంట్స్‌‌‌‌ కంపెనీ విషయంలోనే సుమంత్‌‌‌‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సురేఖ కూతురు సుస్మిత ఆరోపించారు. బీసీలను అణచివేసేందుకే చూస్తున్నారని అన్నారు. రెడ్ల ప్రభావం వల్ల తమను తొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పార్టీ పెద్దలకు తెలిసే జరుగుతోందన్నారు. 

సుమంత్‌‌‌‌పై అభియోగాలు ఉన్నాయని పోలీసులు చెప్పారని, వాటికి ఆధారాలు చూపించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఓస్డీగా విధుల నుంచి తొలగించిన తరువాత అరెస్ట్ చేసేందుకు గల కారణాలు ఏంటో తెలుసుకుంటామన్నారు. దీనిపై గురువారం తమ కుటుంబ సభ్యులతో కూర్చుని చర్చిస్తామన్నారు. పథకం ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. కాగా, మఫ్టీలో వచ్చినవారు వరంగల్ పోలీసులు అని తెలిసింది.