పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్‌‌

 పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్‌‌
  • ఈ ఏడాది ఆరు పేపర్లతోనే పరీక్షలు
  • సబ్జెక్ట్‌‌కు 80, ఫార్మెటివ్​ అసెస్​మెంట్​కు 20 మార్కులు 
  • వంద శాతం సిలబస్‌‌తో పరీక్షలు: మంత్రి సబితారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్‌‌ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌‌ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టెన్త్​ ఎగ్జామ్స్‌‌ నిర్వహిస్తామని బుధవారం విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో విడుదల చేశారు. ఇకపై తొమ్మిదో తరగతి ఫైనల్‌‌ ఎగ్జామ్స్‌‌, పదో తరగతి పబ్లిక్‌‌ పరీక్షల్లో ఆరు పేపర్లే ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 2022–23 విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. 

కరోనా కంటే ముందు హిందీ మినహా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులు రెండు పేపర్ల చొప్పున మొత్తం11 పేపర్లు నిర్వహించేవారు. గతేడాది కరోనా ఉన్నందున ఆరు పేపర్లకు తగ్గించారు. ఈసారి కూడా పేపర్ల సంఖ్యను తగ్గించాలని పలు విజ్ఞప్తులు వస్తుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రతి పేపర్ వంద మార్కులకు ఉంటుంది. ఇందులో 80 మార్కులకు పబ్లిక్ పరీక్ష, 20 మార్కులకు ఫార్మెటీవ్ అసెస్‌‌మెంట్‌‌ ఉండనుంది. సైన్స్‌‌లో మాత్రం ఫిజిక్స్, బయోలజీలను రెండు పార్టులుగా విభజించి, పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పేపర్లను ఒకే రోజు నిర్వహించనున్నారు. ఫిజిక్స్ పేపర్ టైమ్ గంటన్నర పూర్తయిన 20 నిమిషాల గ్యాప్ తర్వాత బయోలజీ పరీక్ష ఉండనుంది. అన్ని పేపర్లకు మూడు గంటల టైమ్ ఉంటే, సైన్స్‌‌ ఎగ్జామ్స్‌‌కు 3.20 నిమిషాలు ఉండనుంది. మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ 11వ తేదీతో ముగియనుండగా, ఓఎస్​ఎస్​సీ ఎగ్జామ్స్ మరో రెండు రోజులు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగను న్నాయి.

మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్ రిలీజ్.. 

ఈ నెల 26న ‘‘మోడల్ పేపర్లు లేవ్’’హెడ్డింగ్‌‌తో వెలుగులో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. 11 పేపర్ల నుంచి ఆరు పేపర్లకు తగ్గిస్తూ జీవో రిలీజ్ చేసింది. దీనికి అనుగుణంగా మోడల్ పేపర్లు, బ్లూప్రింట్‌‌ను ఎస్‌‌సీఈఆర్టీ విడుదల చేసింది. దీంతో స్టూడెంట్లు ఏ సబ్జెక్టులో ఏ పాఠం ఎలా చదవాలనే దానిపై స్పష్టత వచ్చింది. 

సెలవు రోజుల్లోనే స్పెషల్ క్లాసులు: మంత్రి సబిత

పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న స్టూడెంట్లకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని, సెలవు దినాల్లోనూ వీటిని కొనసాగించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఏదైన సబ్జెక్టుల్లో వెనుకబడిన స్టూడెంట్లను గుర్తించి, ప్రత్యేకంగా క్లాసులు చెప్పాలని సూచించారు. బుధవారం టెన్త్ ఎగ్జామ్స్‌‌పై విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్‌‌ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, ఎస్‌‌సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డితో మంత్రి సమీక్షించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రీఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలన్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంద శాతం సిలబస్‌‌తో పరీక్షలను నిర్వహించనున్నట్టు చెప్పారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు చాయిస్ లేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి మోడల్ క్వశ్చన్‌‌ పేపర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.