టెన్త్ విద్యార్థినిది హత్యే: ఫేస్ బుక్ పరిచయం ప్రాణం తీసింది

టెన్త్ విద్యార్థినిది హత్యే: ఫేస్ బుక్ పరిచయం ప్రాణం తీసింది

జడ్చర్ల: టెన్త్ క్లాస్ విద్యార్థిని హత్య కేసు మిస్టరీ వీడింది. ఫేస్ బుక్ లో పరిచయమైన నవీన్ రెడ్డి అనే యువకుడే ఆమెను హత్య చేసినట్లు తెలిపారు పోలీసులు. దీంతో నవీన్ రెడ్డి ఫ్యామిలీ పరారీ అయ్యింది. నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నవీన్ రెడ్డి.. ఫేస్‌ బుక్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకుని రెండుసార్లు కలిశాడు.

రెండు రోజుల క్రితం ఆమె అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె కోసం గాలిస్తుండగా.. షాకింగ్ న్యూస్ తెలిసింది. గురువారం (ఆగస్టు 29,2018) ఉదయం జడ్చర్ల మండలం శంకరాయపల్లి దగ్గర హర్షిణి మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

హర్షిణి జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో టెన్త్ చదువుతుండగా.. హయత్‌ నగర్ మండలం కోహెడకు చెందిన నవీన్ రెడ్డి కారు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఫేక్ ఫేస్‌ బుక్ ఐడీని సృష్టించి నవీన్ రెడ్డి హర్షిణితో ఛాటింగ్ చేశాడని తెలిపారు పోలీసులు. అసలు విషయం తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు హర్షిణి కుటుంబసభ్యులు. నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు, విద్యార్ధిసంఘాలు డిమాండ్ చేస్తూ ..హర్షిణి మృతదేహంతో గురువారం జడ్చర్లలో జాతీయ రహదారిపై బైఠాయించారు.