
- ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్ హత్య కేసులో ఆధారాలిస్తే పరిశీలిస్తాం
- కెనడాలో జరుగుతున్నది సాధారణ విషయం కాదు
- అమెరికా మీడియాతో జైశంకర్
వాషింగ్టన్ : ఖలిస్తానీ సానుభూతిపరులు, టెర్రరిస్టులకు కెనడా ఆశ్రయం ఇస్తోందని మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి ఆ దేశంపై తీవ్రంగా మండిపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో భారత దౌత్యవేత్తలను, పౌరులను బెదిరిస్తూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నా కెనడా సర్కారు చోద్యం చూస్తోందని ఆరోపించారు. వాషింగ్టన్లో శుక్రవారం (అమెరికా టైం) జరిగిన మీడియా సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆధారాలు చూపిస్తే.. దర్యాఫ్తు విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. నిజానికి కెనడా గడ్డ నుంచి ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కు, వేర్పాటువాదానికి పాల్పడుతున్న వ్యక్తులకు ట్రూడో సర్కారు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు.
అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాలె..
క్లైమేట్ చేంజ్, ఆర్థిక అవరోధాల వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించుకోవడం ఏ ఒక్క దేశానికీ ఒంటరిగా సాధ్యంకాదని జైశంకర్ అన్నారు. ప్రపంచ సమస్యల పరిష్కారానికి అన్ని దేశాలూ ఏకతాటిపైకి రావాలన్నారు. వాషింగ్టన్లో జరుగుతున్న వరల్డ్ కల్చర్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ఈ ఫెస్టివల్‌తో అనేక దేశాలకు చెందిన వేలాది మందిని ఆర్ట ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఒకే వేదికపైకి తెచ్చారని కొనియాడారు.
వేరే దేశమైతే ఇలాగే స్పందించేవారా?
ఖలిస్తానీ టెర్రరిస్టుల బెదిరింపుల కారణంగా కెనడాలో భారత దౌత్య కార్యాలయాలను నడిపే పరిస్థితి లేదని, అందుకే వీసా సర్వీసులను నిలిపేశామని జైశంకర్ అన్నారు. ప్రస్తుతం కెనడాలో భారత దౌత్యవేత్తలు సురక్షితంగా ఉండే పరిస్థితి లేదన్నారు. టెర్రర్ యాక్టివిటీస్‌కు పాల్పడుతున్న వ్యక్తులను అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా కెనడా స్పందించట్లేదన్నారు. కెనడాలో జరుగుతున్నది సాధారణ విషయం అయితే కాదన్నారు. జీ7 దేశాలకు గానీ, కామన్వెల్త్ దేశాలకు గానీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే వారి స్పందన ఇలాగే ఉండేదా? అని ప్రశ్నించారు. టెర్రరిస్ట్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా, కెనడా కలిసి భేదాభిప్రాయాలు తొలగించుకోవాలని, అయితే, దీనికన్నా పెద్ద సమస్యలు ఇరుదేశాల మధ్య చాలా ఉన్నాయ న్నారు. ముందుగా టెర్రరిజం, హింసకు కెనడా అనుమతిస్తున్న తీరుపై చర్చ జరగాలన్నారు.