టెట్ కు1.36 లక్షల అప్లికేషన్లే భారీగా తగ్గిన దరఖాస్తులు

టెట్ కు1.36 లక్షల అప్లికేషన్లే భారీగా తగ్గిన దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కు ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యల్పంగా దరఖాస్తులు నమోదయ్యాయి. జూన్-2026 టెట్ దరఖాస్తుల గడువు గురువారం అర్థరాత్రితో ముగియగా.. కేవలం లక్షా 36 వేల 418 మంది అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకున్నారు. గతేడాది నవంబర్‌‌లో నిర్వహించిన టెట్‌‌కు 2,37,754 దరఖాస్తులు రాగా.. ఈసారి ఆ సంఖ్య ఏకంగా లక్షకు పైగా పడిపోవడం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది.

డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై స్పష్టత లేకపోవడం, ఇప్పటికే మెజారిటీ అభ్యర్థులు టెట్ క్వాలిఫై కావడమే ఇందుకు ప్రధాన కారణాలని అధికారులు చెబుతున్నారు. ఈసారి మొత్తం దరఖాస్తుల్లో పేపర్-2 కోసం 86,305 మంది, పేపర్-1 కోసం 32,779 మంది అప్లై చేశారు. రెండు పేపర్లకూ కలిపి 17,334 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇన్-సర్వీస్ టీచర్లు 28,149  మంది ఉండగా.. మహిళా టీచర్లు 14,430 మంది, పురుషులు 13,714 మంది,  ఐదుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.  కాగా, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను సరిచూసుకోవాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ గాజర్ల  రమేశ్  సూచించారు. ఏప్రిల్ 29 నుంచే ఎడిట్ విండో ప్రారంభమైందని, మే 3వ తేదీ వరకు https://schooledu.telangana.gov.in వెబ్‌‌సైట్ ద్వారా మార్పులు చేసుకోవచ్చని తెలిపారు.